Chirala Politics: వైసీపీ నేత ఆమంచి కాంగ్రెస్‌లోకి ఫిక్స్ - కీలక ప్రకటన
AP News: చీరాలలో తన అనుచరులు, అభిమానులతో సమావేశమైన తర్వాత మంగళవారం (ఏప్రిల్ 9) ఆమంచి క్రిష్ణమోహన్ ఈ ప్రకటన చేశారు. త్వరలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పారు.
Amanchi Krishna Mohan: చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి క్రిష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కొంత కాలంగా ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. చీరాల నియోజకవర్గంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశమైన అనంతరం మంగళవారం (ఏప్రిల్ 9) ఆమంచి ఈ ప్రకటన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో సమావేశం అయ్యారు. త్వరలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటన చేశారు.
కొద్ది రోజులుగా తాను చీరాలలో వరుసగా సమావేశాలు పెట్టి అభిప్రాయం సేకరించినట్లుగా ఆమంచి చెప్పారు. వారి అభిప్రాయం మేరకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. అంతకుముందు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగాలని నిర్ణయించుకున్నానని.. ఆటో గుర్తు కూడా అనుకున్నట్లుగా వివరించారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసినందువల్ల తాను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా ఆమంచి చెప్పారు. కాంగ్రెస్ తరపున చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో తాను గెలుస్తానని ఆమంచి ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై తనకు గౌరవం ఉన్నప్పటికీ.. తన భావజాలానికి సెట్ అవ్వకపోవడంతో అందులో ఇమడలేకపోయానని ఆమంచి చెప్పారు. తనకు వైసీపీ అధిష్ఠానం సముచిత స్థానం ఇచ్చిందని.. పర్చూరు నుంచి పోటీ చేయమని సూచించిందని తెలిపారు. అయితే, తనకు చీరాల అయితేనే కరెక్ట్ అనుకుని వైఎస్ఆర్ సీపీ నుంచి బయటకు వచ్చానని ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని చెప్పారు.
చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం
చీరాల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సార్లు ఇరు వర్గాలకు చెందిన వారు బాహాబాహీకి కూడా దిగారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేలా వైసీపీ అధిష్ఠానం ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది. అయినా ఎలాంటి మార్పు రాకపోగా.. శత్రుత్వం మరింత పెరిగింది. ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రయత్నించారు.
తొలుత టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరడంతో పార్టీలో ఆమంచికి ప్రాధాన్యం తగ్గింది. దీన్ని ఆమంచి క్రిష్ణమోహన్ సహించలేకపోయారు. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాలలో వీరిద్దరే ప్రత్యర్థులుగా ఉండగా.. ఆమంచి ఓడారు.. కరణం గెలిచారు. ఎన్నికలు అయిన వెంటనే కరణం బలరాం వైసీపీ కండువా కప్పుకున్నారు. అలా ఈ రెండు వర్గాల మధ్య ఓ యుద్ధమే జరుగుతూ వచ్చింది.
బలమంతా చీరాలలోనే
ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధిష్ఠానం చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు చీరాల ఇంఛార్జి బాధ్యతలు.. మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చింది. కానీ, తన బలమంతా చీరాలలోనే ఉందని ఆమంచి భావించి.. పర్చూరు బాధ్యతలను అయిష్టంగానే తీసుకున్నారు. కానీ, ఎలాగైనా చీరాలలోనే పోటీ చేయాలని ఫిక్స్ అయి.. వైసీపీకి రాజీనామా చేసి బయటికి వచ్చారు. తాజాగా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.