(Source: ECI/ABP News/ABP Majha)
Amalapuram Clashes : అసాంఘిక శక్తులు అమాయకులా? అల్లర్ల కేసులు ఎత్తివేత సిగ్గుచేటు- దళిత సంఘాలు
Amalapuram Clashes :అమలాపురం అల్లర్లు చేసిన అసాంఘిక శక్తులు అమాయకులా? ప్రభుత్వమే నేరస్థులను కాపాడడం సిగ్గుచేటని దళిత ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి.
Amalapuram Clashes : అమలాపురం అల్లర్లలో సృష్టించిన విధ్వంసానికి చట్ట ప్రకారం శిక్షించకుండా వారందరూ అమాయకులు అని వారి మీద కేసులు ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని దళిత ప్రజాసంఘాలు తప్పుబడుతున్నాయి. సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ధర్నా నిర్వహించారు.
అసాంఘిక శక్తులు అమాయకులా
దళితుల పంతం జగన్ అంతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దళిత సంఘాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గృహదహనాలకు పాల్పడి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించిన నేరస్థులను నిర్దోషులని ప్రకటించి కేసులు ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. రాజ్యాంగాన్ని చట్టాలను అపహాస్యం చేయడమేనని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం నేరస్థులను పట్టుకుంటే రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నేరస్థులను అమాయకులని చెప్పడం దారుణమని అన్నారు. అందరూ అమాయకులు అయితే అసలు దోషులు ఎవరని ప్రశ్నించారు. ఒక దళిత మంత్రి ఇంటిని దహనం చేస్తే నేరస్థులను శిక్షించకుండా మంత్రికి ఎమ్మెల్యేకు న్యాయం చేయకపోతే రాష్ట్రంలో ఉన్న దళితులకు రక్షణ ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
2024 ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం
నేరస్థులను మరిన్ని నేరాలు చేసే విధంగా జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అమలాపురం అల్లర్ల కేసుల ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమలాపురంలో అల్లర్లు సృష్టించిన నిందితులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళిత ఓటు బ్యాంకుతో గద్దె నెక్కిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంతం చూసేదాకా దళితులు పంతం మారరని దళిత నాయకులు హెచ్చరించారు. కేసులు ఎత్తివేత వ్యవహారంలో త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే 2024 ఎలెక్షన్లో తగిన గుణపాఠం చెప్పి మట్టికరిపిస్తామని అన్నారు.
కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం
అమలాపురం అల్లర్ల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన రిక్వస్ట్ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. స్థానికంగా ఉన్న నాయకులు కూడా ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజిక వర్గాల నాయకులతో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. అమలాపురం ఘటనలో నమోదైన కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయంపై కోనసీమ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలిసి మెలిసి జీవిస్తున్నారని.. అక్కడే పుట్టి, అక్కడే పెరిగి జీవిత చరమాంకం వరకు అక్కడే ఉంటున్నారని తెలిపారు. రేపు అయినా అక్కడే పుట్టాలి, అక్కడే పెరగాలి, అక్కడే జీవితాల్ని ముగించాలన్నారు. అందుకే భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినపుడు.. వాటిని మర్చిపోయి మునుపటిలా కలిసిమెలిసి జీవించాలన్నారు. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు.