పులివెందులలో YSRCP ఓటమి: కుప్పం ఎఫెక్ట్! జగన్ కంచుకోటలో టీడీపీ సంచలన విజయం వెనుక అసలు కారణం ఇదేనా?
YSRCP Pulivendula Defeat: పులివెందుల నియోజకవర్గంలో జగన్ మోహనరెడ్డి దారుణ పరాభవానికి రీజన్ ఏంటి..? పులివెందుల ZPTC ఓటమికి.. కుప్పుంకు కనెక్షన్ ఉందా..? అదేంటో చూడండి

YSRCP Pulivendula Defeat: పులివెందులలో ZP ఎన్నికల్లో ఘోర పరాభవానికి కుప్పంలో లింక్ ఉందా..అప్పటి అత్యుత్సాహమే ఇప్పటి ఓటమికి కారణమైందా అన్నవిశ్లేషణలు వస్తున్నాయి. 2021 స్థానిక ఎన్నికల్లో కుప్పంను కొల్లగొట్టి.. Why Not Kuppam అంటూ చేసిన అతి చర్యలవల్లే ఇప్పుడు YSRCPకి ఈ పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం అంటోంది. వై నాట్ 175 అంటూ అప్పట్లో జగన్ కుప్పం ను కూడా కలుపుకునే అన్నారు. దానికి ప్రతిగా చంద్రబాబు వైనాట్ పులివెందుల అంటూ సవాల్ చేశారు.
అప్పట్లో జగన్ అయినా.. చంద్రబాబు అయినా కూడా ముఖాముఖీగా వాళ్ల నియోజకవర్గాలను కూడా ఓడిస్తామని సవాల్ చేశారు. అది జరగలేదు కానీ.. ఏడాది తర్వాత పులివెందులలో వైసీపీని టీడీపీ చావు దెబ్బ కొట్టింది. వైఎస్ కుటుంబానికి ఓటమంటే తెలియని పులివెందులలో అదీ ఆ మండలంలో వైసీపీని డిపాజిట్ కూడా రాకుండా ఓడించడం వెనుక చాలా సంగతే ఉంది. క్యాడర్ కష్టపడిందా.. అధికారంతో అక్రమాలు చేసిందా.. ప్రత్యర్థులను భయపెట్టిందా.. లేక జగన్‌పైనే వ్యతిరేకత వచ్చిందా.. ఇలా ఎన్నిరకాల వాదనలున్నా.. సరే మొత్తానికి ఆన్ రికార్డ్ టీడీపీ అక్కడ గెలిచింది. దీనికి కారణం కుప్పం..
కుప్పంలో వైఎస్సార్సీపీ చేసిందే ఇక్కడ జరిగిందా..?
సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలు అంత దృష్టి పెట్టవ్.. వాళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేత నియోజకవర్గంలో రాజకీయ ఫిరాయింపులని ప్రోత్సహించడం లాంటివి కూడా చేయరు.. అదంతా వైఎస్ చంద్రబాబు జమానా వరకూ సాగింది. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2017లో కడప జిల్లాలో బీటెక్ రవిని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా టీడీపీ గెలిపించుకోగలిగింది. చంద్రబాబు తన జిల్లాలో రాజకీయం చేస్తే.. జగన్ ఏకంగా ఆయన నియోజకవర్గంలోనే చేశారు. 2021 స్థానిక ఎన్నికల్లో కుప్పం మునిసిపాలిటీతో పాటు.. నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీలను.. ఎంపీటీసీలను కూడా వైసీపీ కైవసం చేసుకుంది.
పులివెందులో టీడీపీ దౌర్జన్యాలు చేసిందని.. ఓటర్లను బయటకు రానివ్వకుండా రిగ్గింగ్ చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. మరి ఆ రోజు.. కుప్పంలో జరిగింది కూడా అదే. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. జర్నలిస్టులను కూడా కొట్టారు. ఆ నియోజకవర్గం మొత్తం టీడీపీ బయటకు రాకుండానే చేశారు.
కుప్పంలో చంద్రబాబు అప్పటికే 7సార్లు ఎమ్మెల్యే. ప్రత్యర్థి పార్టీకి అంతగా పట్టు లేదు. కానీ 2021లో కుప్పం పరిధిలోని 89 పంచాయతీల్లో YSRCP 74చోట్ల గెలిచింది. నియోజకవర్గంలోని 4 మండలాలు వైసీపీ పరం అయ్యాయి. ఇక నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో అయితే.. ఏకంగా 17వేలు, 16వేలు, 11 వేల చొప్పున మెజార్టీలు వచ్చాయి. 68 ఎంపీటీసీ స్థానాల్లో 63 వైసీపీవే..! పెద్దిరెడ్డి కుప్పంలోనే క్యాంప్ వేసి మరీ ఎన్నికల్లో ఈ రిజల్ట్ తెప్పించారు. “చంద్రబాబు ఇలాకాలో 90శాతానికి పైగా సీట్లు అప్పట్లో వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. మరిప్పుడు ఒక్క చోట ఓడిపోతేనే గగ్గోలు పెడుతున్నారు ఎందుకు” అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కుప్పంలో గెలుపొందిన వైసీపీ అక్కడితో ఆగలేదు.. చాలా అత్యుత్సాహం ప్రదర్శించింది. చంద్రబాబు ఓడిపోయాడని.. కూలిపోయాడని... ప్రచారం ప్రారంభించింది. జెడ్పీ ఓట్ల లెక్కల ప్రకారం చంద్రబాబు కంటే 62వేల ఓట్లు మెజార్టీ వచ్చిందని చెప్పింది. దీనికి కుప్పం మునిసిపాలిటీమెజార్టీ అదనం.. అది కూడా కలుపుకుంటే 75వేల ఓట్లు మెజార్టీ...వైనాట్ 175 స్లోగన్‌కు అదే బీజం కూడా..! అప్పట్లో నియోజకవర్గం మొత్తం కొల్లగొట్టిన వైసీపీ ఇప్పుడు రెండు ZPTC ఓటములను జీర్ణించుకోలేకపోయింది.
YSRCP లెక్క ప్రకారం చంద్రబాబుకు అప్పటికే ఉన్న మెజార్టీని దాటుకుని 75వేలు ఓట్లు పెరిగాయంటే.. దాదాపు లక్ష ఓట్లు టర్న్ అయినట్లు. కానీ 2024 రిజల్ట్ మాత్రం వేరు. చంద్రబాబు తనకు అంతకు మందు వచ్చిన దానికంటే.. 18వేలు పెంచుకున్నారు. మరి ఈ లక్ష ఓట్లు ఏమయ్యాయి. ఇక జగన్ తనకు ఉన్న 90వేల మెజార్టీ నుంచి 60వేలకు పడిపోయారు. దీనిని బట్టే పులివెందులలో జగన్ ప్రాభవం తగ్గినట్లు కనిపిస్తోంది. అప్పట్లో కుప్పం ఒక్కదానితోనే ఆగలేదు.. జిల్లా మొత్తంలో 65 జెడ్పీ స్థానాలుంటే.. 65 వైసీపీనే గెలిచింది. ఇందులో ఏకంగా 33 స్థానాలు ఏకగ్రీవాలయ్యాయి. ఇలాంటి పరిస్థితి ఎంజాయ్ చేసిన వైసీపీ ఇప్పుడు రెండు ఓటములను తీసుకోలేకపోతోంది.

పులివెందులను టార్గెట్ చేసిన లోకేష్
కుప్పంలో జరిగిన హంగామాను తెలుగుదేశం చాలా సీరియస్‌గా తీసుకుంది. అందుకే పులివెందులను టార్గెట్ చేసింది. జగన్ నేరుగా ఓడించడం సాధ్యం కాదు అని తెలిసి.. అక్కడ దెబ్బకొట్టడానికి తగిన అవకాశం కోసం చూసింది. మరో ఏడాదిలోనే స్థానిక ఎన్నికలున్నాయి. మామూలుగానే టీడీపీ స్థానిక ఎన్నికలను వేగంగా పెట్టదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపఎన్నిక పెట్టడం.. అది కూడా పులివెందులలో పెట్టడం అంటే ఓ రకంగా రిస్క్ తీసుకున్నట్లు అర్థం. లోకేష్ నేరుగా ఇన్వాల్వ్ అయి... పులివెందుల ఎన్నికకు చొరవ చూపినట్లు తెలుస్తోంది. కచ్చితంగా గెలిచి తీరాలన్న టాస్క్ ఇచ్చిన తర్వాత.. గెలిచి తీరతామన్న నమ్మకంతోనే ముందుకెళ్లారు. జగన్‌ను మొన్నటి ఎన్నికల్లో ఎదుర్కొన్న బీటెక్‌రవి భార్య లతా రెడ్డిని రంగంలోకి దింపారు. గురి చూసి వైఎస్ కుటుంబం కుంభస్థలాన్ని కొట్టారు.
ఇంత దారుణమైన ఫలితమా..?
కుప్పంలో తెలుగుదేశం నాలుగు చోట్ల కలిపి 20వేల ఓట్లు అయినా సాధించింది. కానీ.. పులివెందులలో వైఎస్సార్సీపీకి డిపాజిట్ రాలేదు. 7వేలకు పైగా ఓట్లు పోలైతే... 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం అసలు ఓటర్లను ఇళ్లనుంచి బయటకు రానివ్వకుండా మొత్తం రిగ్గింగ్ చేసుకుందని వైసీపీ ఆరోపణ. చాలా చోట్ల దొంగ ఓట్లు వేసిన ఆధారాలను ఆ పార్టీ అధినేత బయటపెట్టారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు నుంచి ఓట్లు వేశారని చెప్పారు. ఇవే తరహా ఆరోపణలు కుప్పుం ఎలక్షన్‌లోన వచ్చాయి. మేం రిగ్గింగ్ చేసుకుంటే.. “ఓటింగ్ 74శాతమే ఎందుకవుతుంది.. 90శాతం చేసుకునే వాళ్లం కదా..” అని టీడీపీ అంటోంది.
అవినాష్‌రెడ్డి మీద వ్యతిరేకత కూడా కారణమా..?
తెలుగుదేశం దూకుడుగా వెళ్లినట్లు కనిపిస్తున్నా.. కొన్ని చోట్ల వైసీపీ ఓటర్లు కూడా ఓటింగ్‌కు నిరాసక్తత చూపారు. కొన్నేళ్లుగా నియోజకవర్గంలో వైఎస్ అవినాష్‌రెడ్డి హవానే సాగుతోంది. జగన్ సొంత నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. వైఎస్ అవినాష్‌పై కోపం ఉన్న వాళ్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇలా చేస్తే అయినా జగన్‌కు విషయం అర్థం అవుతుంది అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సరే ఏదైతే ఏంటి.. మొత్తానికి మొట్టమొదటి సారి తెలుగుదేశం పులివెందులలో జెండా ఎగరేస్తే.. 45ఏళ్ల తర్వాత వైఎస్ కుటుంబం ఓటమిని ఎదుర్కొంది.
Why Not కుప్పం అంటూ ఆరోజు.. చేసిన దానికి Why Not పులివెందుల అంటూ వీళ్లు బదులిచ్చారు.





















