Warangal News: నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు
Warangal News: అధిక మొత్తంలో దిగుబడి వస్తుందని నమ్మించి నకిలీ విత్తనాలు అంటగట్టి తమను పలువురు మోసం చేశారంటూ రైతులు కన్నీరు పెడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
Warangal News: అధిక దిగుబడి వస్తుందని అన్నదాతలను నమ్మించి పలు కంపెనీలు మోసం చేశాయి. ఎకరాలు 14 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని చెప్పగా.. కనీసం మూడు క్వింటాళ్లు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను మోసం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ నష్టపోయిన రైతులంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు. వారిని అరెస్ట్ చేసి.. మరోసారి ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మనీయకుండా చేయమంటూ వేడుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల్ మీదికొండ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 40 మంది రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టారు అంకుర్ కంపెనీ సీడ్స్ ప్రతినిధులు. పంట వేసే సమయానికి ముందే తమ గ్రామంలోకి వచ్చి ఈ విత్తనాలు వాడితే, అధిక మొత్తంలో దిగుబడి వస్తుందంటూ నమ్మించారు. ఎకరాకు 14 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని.. క్వింటాల్ కు 7500 రూపాయల చొప్పున తమ కంపెనీయే పంటను కొనుగోలు చేస్తుందని కూడా నమ్మించారు. అయితే ముందుగా పలువురు రైతులు నమ్మి వాటని కొనుగోలు చేయగా.. మిగతా వారు కూడా ఒకరిని చూస్తూ మరొకరు ముందుకు వచ్చారు. ఇలా దాదాపు 40 మంది రైతులు అంకుర్ సీడ్స్ కంపెనీకి చెందిన నకిలీ విత్తనాలను కొనుగోలు చేశారు.
వాటితోనే ఆరుగాలం కష్టపడి పంటను పండించారు. చూసేందుకు పంట బాగానే కనిపించినప్పటికీ.. దిగుబడి మాత్రం చాలా తక్కువగా వచ్చింది. 14 క్వింటాళ్లు వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్పగా.. ఎకరాకు కేవలం మూడు క్వింటాళ్ల ధాన్యం మాత్రమే వచ్చింది. ఇదే విషయాన్ని కంపెనీ యజమానులకు చెప్పి వారిని అడగ్గా.. వాతావరణం సరిగ్గా లేకే పంట నాశనం అయిందని.. దానికి తమ కంపెనీ బాధ్యత వహించదని చెప్పి వెళ్లిపోయారు. ఏం చేయాలో పాలుపోని అన్నదాతలు... అంకుర్ కంపెనీకి చెందిన కేశిరెడ్డి రాజిరెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని.. కంపెనీని సీజ్ చేయాలని కోరారు. అలాగే తమలా మరే రైతు మోసపోకుండా చూసే బాధ్యత మీదే అంటూ పోలీసులు కాళ్ల మీద పడి కన్నీరు పెట్టుకున్నారు.
"నా పేరు స్వప్న. మేం గత పదకొండు సంవత్సరాల కాడికెళ్లి పంట పండిస్తున్నం. మేం కష్టం చేసిన తీరు పంటలు మంచిగనే వచ్చినయ్. ఈసారి అన్నరు ఎకరాన 14 క్వింటాళ్లు ఎల్తయ్, మంచి సీడ్ ఇస్తం, కొత్త సీడ్ అచ్చింది అన్నరు. సేర అనేశి పెట్టినం. ఏదో బతుకుతమని పెట్టినం. కూలీ మనిషి దొర్కకపోయినా 500, 600 కూలీలు ఇచ్చుకుంట పని చేపిచ్చుకున్నం. అట్ల ఖర్చయినా సరే బతుకుతం కదా అనుకున్నం. పెట్టినందుకు ఎకరానా 14 క్వింటాళ్లు కాదు కదా.. ఎకరానా మూడు బస్తలు కూడా ఎల్లలేవు. మూడెకరాలు వెట్టిన. అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. మరి గిదీ పరిస్థితి. పెట్టుబడి పెట్టినం. కూలీలకు విత్తనాలకే లక్ష రూపాలైనయ్. మిషన్ తోని కోపిస్తే పైసలేంది, మిగతావాటికి ఏంది. అంతా నాశన్మే. మూడెకరాలకు కలుపుకొని మొత్తం 8 బస్తాలు వచ్చినయ్. మేం ఎట్ల బతకాలే. ఏం జేయాలే." - స్వప్న మహిళా రైతు