Database on seeds: తెలంగాణలో విత్తనరంగం మరింత బలోపేతం-త్వరలోనే సీడ్ డాటాబేస్
విత్తనరంగాన్ని మరింత బలోపేతం చేసేందుకుం తెలంగాణ వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. త్వరలో తెలంగాణ సీడ్ డేటాబేస్ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని విత్తనరంగానికి సంబంధించిన వివరాలను అందులో పొందుపరచనుంది.
తెలంగాణ విత్తనరంగాన్ని మరింత బలోపేతం చేయబోతోంది వ్యవసాయ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో విత్తనరంగానికి సంబంధించిన వివరాలన్ని ఒకే దగ్గర అందుబాటులో ఉండేలా చేయబోతోంది. అందుకోసం సరికొత్తగా.. సీడ్ డాటాబేస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు కూడా చేపడుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే... దేశంలో విత్తనరంగంపై డాటాబేస్ సిద్ధం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించనుంది.
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచడానికి విత్తనం ముఖ్యపాత్ర పోషిస్తుంది. విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. ఒకప్పుడు కొన్ని మండలాలకే పరిమితమైన విత్తన పంటల సాగు... ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. అన్ని పంటలకు కలిపి సగటున ప్రతి ఏటా 44 లక్షల టన్నుల విత్తనాల ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో వరి, మక్కజొన్న సీడ్స్ భారీగా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీల సహకారంతో మేలు రకం, ఎక్కువ దిగుబడినిచ్చే సీడ్స్‌ను సాగుచేస్తున్నారు రైతులు.
ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ. తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు, సదుపాయాలు ఉన్నాయి. తెలంగాణలో సుమారు 400 విత్తన కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఇక్కడ విత్తనోత్పత్తి చేస్తుంటే... మరికొన్ని కంపెనీలు ప్రాసెసింగ్ చేస్తున్నాయి. వీటిలో గంటకు 670 మెట్రిక్ టన్నుల విత్తనాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. తెలంగాణ నుంచి ఏటా 24 లక్షల క్వింటాళ్ల విత్తనాలు... ఇతర రాష్ర్టాలకు, దేశాలకు సరఫరా అవుతున్నాయి. దేశ అవసరాలకు 60 శాతం విత్తనాలు కేవలం తెలంగాణ నుంచే అందుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి కంపెనీ నుంచి ప్రత్యేకంగా వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఆ వివరాల ఆధారంగా విత్తనరగం మరింత అభివృద్ది చెందేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై స్పష్టత వస్తుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. అందుకే డాటాబేస్ రూపొందిస్తోంది.
సీడ్ డేటాబేస్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నదే లక్ష్యం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలో ఆధ్వర్యంలో ఎంత విత్తనోత్పత్తి జరుగుతోంది..? దాని విస్తీర్ణం ఎంత? ఉన్న కంపెనీలు ఎన్ని..? ఏ కంపెనీ పరిధిలో ఎంత విత్తనోత్పత్తి అవుతోంది..? ప్రాసెసింగ్, ప్యాకింగ్ ఎక్కడ జరుగుతుంది..? ఎన్ని రకాల విత్తనాలను కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి..? ఏఏ కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ శుద్ధి చేస్తున్నాయి..? ఎంత మంది విత్తన రైతులు ఉన్నారు..? విత్తన రంగం వల్ల ఎంత మందికి ఉపాధి లభిస్తోంది..? ప్రతి ఏటా విత్తనోత్పత్తి పెరుగుల ఏ మేరకు ఉంది..? ఇలా అన్ని వివరాలు సేకరించనుంది వ్యవసాయశాఖ. సేకరించిన వివరాలను డాటాబేస్‌లో పొందుపరచనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది. కూడా. అధికారులు కంపెనీల వారీగా... వివరాలు సేకరిస్తున్నారు.
ఒక్కసారి సీడ్ డాటాబేస్ అందుబాటులోకి వస్తే రాష్ట్ర విత్తనరంగం మరింత వేగంగా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. సీడ్ డాటా ఆధారంగా రాష్ర్టానికి అవసరమైన విత్తనాలను ఉత్పత్తి చేయించి రైతులకు సకాలంలో సరఫరా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఎగుమతులకు అనుకూలమైన విత్తనాలను గుర్తించి వాటి ఉత్పత్తిని పెంచుకోవచ్చు. విత్తనరంగం అభివృద్ధికి మరింత మెరుగైన చర్యలు తీసుకోవచ్చు.