Paper Made From Tree: చెట్ల నుంచి కాగితం ఎలా తయారు చేస్తారో తెలుసా!
Paper Made From Tree: చెట్ల నుంచి కాగితం తయారు చేస్తారని మనకు తెలుసు. అయితే ఏ విధంగా తయారు చేస్తారు. ఒక టన్ను పేపర్ తయారీకి ఎన్ని చెట్లు అవసరం అనే విషయాలపై ప్రత్యేక కథనం.
Paper Made From Tree: పేపర్ (కాగితం).. ఇది వాడని మనుషులు ఉండరు. ఒక మనిషి తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాగితాన్ని ఉపయోగిస్తాడు. పాఠశాలలు, కళాశాలలు, సంస్థలు, హోటళ్లు, ఆఫీసులు వీటిల్లో కాగితం అవసరం చాలా ఉంటుంది. మరి మన దైనందిన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ కాగితాన్ని ఎలా తయారుచేస్తారో తెలుసా. అసలు ఎన్ని రకాల పేపర్లు ఉన్నాయి? కాగితం తయారీకి ఉపయోగించే చెట్లు ఏవి? ఒక చెట్టు నుంచి ఎంత పేపరును తయారు చేయవచ్చు. దీనిపై ప్రత్యేక కథనం మీకోసం.
కాగితం అనేది సన్నని పొరలతో తయారుచేయబడిన పదార్థం. చెట్ల నుంచి కాగితాన్ని తయారుచేస్తారు. చెక్క గుజ్జు, గోధుమ గడ్డి లేదా మాములు గడ్డి, గుడ్డ ముక్కలు, పీచు పదార్థాలు కాగితం తయారీకి కావలసిన ముడి పదార్థాలు. చెట్లు, మొక్కల నుంచి లభించే సెల్యులోజ్ ను కాగితం తయారీకి ఉపయోగిస్తారు. సెల్యులోజ్, ఫైబర్ లను కలపడం ద్వారా పలుచని పొర ఏర్పడుతుంది. దీనితో పేపర్ ను తయారు చేస్తారు. స్వచ్ఛమైన సెల్యులోజ్ చాలా ఖరీదైనది. పేపరు నాణ్యత ఈ సెల్యులోజ్ స్వచ్ఛతపైనే ఆధారపడుతుంది.
కాగితం తయారీ ఇలా..
1. ముందుగా కాగితం తయారీకి అవసరమైన చెట్లను ఎంపిక చేస్తారు. కలపలో ఎక్కువ మొత్తంలో ఫైబర్స్ ఉండే చెట్లను ఎంచుకుంటారు.
2. ఎంపిక చేసిన చెట్ల కలపను గుండ్రటి ముక్కలుగా కోసి, పై బెరడు తీసి ఫ్యాక్టరీకి పంపుతారు.
3. ఆ చెట్ల ముక్కల నుంచి గుజ్జు తయారు చేస్తారు. అది రెండు విధాలుగా ఉంటుంది.
మెకానికల్ పల్పింగ్ విధానం: ఈ విధానంలో పల్ప్ తయారు చేయడానికి రసాయనం అవసరం లేదు. ఈ పద్ధతిలో తయారు చేయబడిన కాగితం వార్తాపత్రికలు లేదా మ్యాగజైన్‌లకు ఉపయోగిస్తారు.
రసాయన పల్పింగ్ విధానం: ఇది సాధారణంగా ఉపయోగించే పద్ధతి. మెకానికల్ పల్ప్‌తో తయారు చేసిన కాగితం కంటే రసాయన పల్ప్‌తో తయారు చేయబడిన కాగితం మృదువైనది, మెరిసేది ఇంకా అధిక నాణ్యతతో ఉంటుంది.
4. పల్ప్ సిద్ధమైన తర్వాత, దానిని కొట్టి, పిండి చేయాలి. ఆ పిండికి సుద్ద, మట్టి లేదా రసాయనం (టైటానియం ఆక్సైడ్) మొదలైన పూరక పదార్థాలను కలుపుతారు.
చివరగా, గుజ్జును కాగితం తయారు చేసే యంత్రంలో వేస్తారు. ఇక కాగితం తయారవుతుంది. దాన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
పైన్, ఫిర్, హెమ్లాక్, స్ప్రూస్, లర్చ్, ఓక్ మాపుల్, బిర్చ్ మొదలైన చెట్లను కాగితం తయారీకి ఉపయోగిస్తారు.
ఒక టన్ను నాణ్యమైన కాగితం తయారు చేయడానికి 12 నుండి 17 చెట్లు అవసరం అవుతాయి. పూతతో కూడిన కాగితం అధిక-నాణ్యత ముద్రణ మరియు మ్యాగజైన్‌ల కోసం ఉపయోగిస్తారు. 1 టన్ను మ్యాగజైన్ పేపర్‌కు 15 చెట్లు అవసరం. 1 టన్ను వార్తాపత్రిక కాగితాన్ని తయారు చేయడానికి 12 చెట్లు పడతాయి.