Rain: అకాల వర్షాలతో రైతన్న కుదేలు.. చేతికొచ్చిన పంట దెబ్బతిందని దిగులు..
ఆకాల వర్షం వచ్చి.. అన్నదాతలను ముంచింది. జగిత్యాల జిల్లాలో కురిసిన వర్షం.. రైతన్నలు నష్టాన్ని మిగిల్చింది.
జగిత్యాల జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల తో పాటు రాయికల్ సారంగాపూర్, మెట్ పల్లి, కోరుట్ల, పలు మండలాల్లో భారీ వర్షం పడడంతో వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. అదేవిధంగా వేల సంఖ్యలో పూతకు వచ్చిన మామిడి రాలి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయమని తేల్చడంతో ఆందోళన చెందుతున్న రైతులకు అకాల వర్షం.. కన్నీరే మిగిలించింది. కోలుకోలేని దెబ్బ పడిందని.. రాష్ట్రప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని పలువురు రైతులు కోరుతున్నారు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తక్కువ ఎత్తులో వేగంగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాళపల్లి, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.
ఏపీలోనూ వర్షాలు
ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చిరు జల్లులు కురవనున్నాయి. కొన్ని చోట్ల మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జనవరి 13 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
Also Read: Mahabubabad: కన్న బిడ్డల్ని బావిలోకి నెట్టేసిన సీఆర్పీఎఫ్ జవాను! వెంటనే పరారీ.. కారణం ఏంటంటే..
Also Read: Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..