అన్ని వర్గాల కౌలు రైతులకు అండగా ఉంటున్నాం- ఇలాంటి ప్రభుత్వం ఎక్కడా లేదు: సీఎం జగన్
గడువు కంటే ముందే నిధులు అందించే ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదేమో అని జగన్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ భూమిలేని ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అండగా నిలబడుతున్నామని అన్నారు.
రాష్ట్రంలోని కౌలు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్... దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులకు తోడుగా నిలబడే ప్రభుత్వం తమదేనన్నారు.
తొలి విడతగా రాష్ట్రంలోని 1, 46,324 మంది కౌలు రైతులకు 109,74 కోట్లు జమ చేస్తున్నామన్నారు జగన్. ఇంకా ఆయన ఏమన్నారంటే.. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతోపాటు దేవాదాయ, అటవీ భూములు సాగు చేస్తున్న సాగుదారులకు వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింప చేశాం. పంటహక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలుదారులు, దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు సాయం పంపిణీ చేస్తున్నాం. 2023-24 సీజన్‌కు సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం ఇది" అని జగన్ తెలిపారు.
"కౌలు రైతులకుదేవాలయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు 2023-24 తొలి విడత పెట్టుబడి సాయం 7,500 అందిస్తున్నాం. అదే టైంలో ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీని కూడా అందిస్తున్నాం. సీజన్ ముగిసేలోపు రైతులకు నష్ట పరిహారం అందచేస్తున్నాం అని తెలిపారు.
వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా... కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా.
— YSR Congress Party (@YSRCParty) September 1, 2023
రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు(సీసీఆర్సీలు) పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలివిడతగా వైఎస్సార్ రైతు… pic.twitter.com/LwTmNv5H0q
ఇలా గడువు కంటే ముందే నిధులు అందించే ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదేమో అని జగన్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ భూమిలేని ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అండగా నిలబడుతున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అటవీ భూములకు సైతం సాగు చేసుకునే గిరిజనులకు తోడుగా ఉంటున్నామని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5, 38,337 మంది కౌలు రైతులకు 3,99,321 మంది అటవీ భూమి సాగు చేస్తున్న సాగుదారులకు 1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించామన్నారు జగన్. మొత్తంగా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు 52.57 లక్షల రైతు కుటుంబాలకు 31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని చేశామని తెలిపారు. కేవలం ఈ నాలుగు సంవత్సరాల్లోనే జరిగిన ఈ మార్పులను గమనించాలని జగన్ కోరారు. రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మంచి చేస్తున్న ప్రభుత్వానికి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.