Anantapur Drought: ఈ జిల్లాలో తీవ్రమైన కరవు, నిలువునా మునిగిన రైతులు - ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు!
AP Latest News: సాధారణంగా లోటు వర్షపాతం నమోదైన మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారు. సాధారణం కంటే 19 శాతం తక్కువ పడితే లోటు వర్షపాతంగా అధికారులు గుర్తిస్తారు.
Anantapur Drought News: ఉమ్మడి అనంతపురం జిల్లాను ఈ ఏడు కూడా కరువు రైతులను కమ్మేసింది. ఖరీఫ్ సాగులో పంటలు నిలువునా ఎండిపోయాయి. వేరుశనగ సాగు చేసిన రైతులకు కనీసం పశుగ్రాసం కూడా మిగలని పరిస్థితి ఏర్పడింది. కంది, ఆముదం, మిరప, పత్తి ఇతర పంటలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. రబీలో పంటలు వేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రతి ఏటా కంటే ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువ కారణంగా రబీలో వేసే ప్రధాన పంట పప్పులు, శేనగ సాగు చేయాలంటే రైతులు సాహసం చేయాల్సిందే. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 80 శాతం మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 63 మండలాలకు గాను 49 మండలాలను మాత్రమే కరువు ఉందంటూ గుర్తించింది.
రైతుల నుంచి విమర్శలు
సాధారణంగా లోటు వర్షపాతం నమోదైన మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారు. సాధారణం కంటే 19 శాతం తక్కువ పడితే లోటు వర్షపాతంగా అధికారులు గుర్తిస్తారు. మండలాల్లో ఐదు సంవత్సరాల సగటును లెక్కించి సాధారణ వర్షపాతాన్ని నిర్ణయిస్తారు. చాలా మండలాల్లో అప్పటి లెక్కల్ని తీయడంతో సాధారణ వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చూపుతూ అన్యాయం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
కరవు పరిస్థితులను అంచనా వేయడంలో వ్యవసాయ శాఖ, భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ శాఖలు కీలకంగా వ్యవహరిస్తాయి. మండలాల వారీగా ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవ్వాలి.. విస్తీర్ణం తగ్గితే కారణాలేంటి? అనే అంశాలను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదికలు పంపుతుంది. లోటు వర్షపాతం ఎంత? వర్షానికి వర్షానికి మధ్య విరామం ఎంత? అన్ని వివరాలు రెవెన్యూ అధికారులకు పంపుతారు. భూగర్భ నీటి మట్టం తీరును భూగర్భజలాల శాఖ పంపుతుంది. పంట దిగుబడులను అంచనా వేసి నివేదించాల్సి ఉంటుంది. ఇలా అన్ని నివేదికలు పరిశీలించిన అనంతరం ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటిస్తుంది.
మొత్తానికి తీవ్రమైన కరువుతో రైతులు నిట్టనిలువునా మునిగారు. వర్షాభావ పరిస్థితులతో వేసిన పంట చేతికందక రైతులు లబోదిబోమంటున్నారు. వేసిన పంట భూమిలోనే ఉండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 28 మండలాలు.. శ్రీ సత్యసాయి జిల్లాలో 21 మండలాల్లో మాత్రమే కరువు ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా వేరుశనగ పంటను రైతులు సాగు చేస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల హెక్టార్ల పైనే వేరుశనగ సాగు చేస్తారు. ఈ ఏడాది వర్షాభావ ప్రభావంతో ఒకటిన్నర లక్షల హెక్టార్లు మాత్రమే వేరుశనగ సాగు చేశారు. మరో లక్ష హెక్టార్లలో కంది, ఆముదం ఇతర పంటలను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం తీవ్రమైన వర్షాభావంతో పంట నేలలోనే ఉండిపోయింది.
ఎకరాకు 40 వేల ఖర్చు
కొంతమంది రైతులు పంటను అలాగే వదిలేయలేక వేరు శనగను పొలంలో నుంచి తొలగిస్తున్నారు. అయితే ఒక్కో చెట్టుకు సుమారు 30 నుంచి 40 కాయలు దిగుబడి ఉండాల్సిన పరిస్థితుల్లో కేవలం చెట్టుకు మూడు నుంచి ఐదారు కాయలు మాత్రమే ఉండడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒక్క ఎకరాకు కనీసం విత్తనాలు, దుక్కి చేయడానికి, వ్యవసాయ మందులు, కూలీలు ఖర్చులన్నీ సుమారుగా 40 వేల వరకు వస్తాయి. ప్రస్తుతం ఎకరాకు పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
కరవు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షం చాలా తక్కువగా వర్షపాతం నమోదయింది. వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో 1.60 లక్షల హెక్టార్ల సాగుభూమి బీడు భూమిగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావంతో కరువులో కూరుకుపోయి ఉంటే తమ మండలాలను కరువు మండల ప్రకటించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు.