TSRTC సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు- డ్రైవర్ రాములుపై దాడిని ఖండించిన సజ్జనార్
Telangana News: వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ రాములుపై ప్రయాణికుడు చేసిన దాడిని సంస్థ ఎండీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TSRTC MD VC Sajjanar - వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో RTC డ్రైవర్ రాములు పైన నవాజ్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘనపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. ఎవరైనా TSRTC ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి జరగడంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏమన్నారంటే..
ప్రజల మధ్య ఉంటూ ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు విధులు నిర్వర్తించే TSRTC సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని సజ్జనార్ హెచ్చరించారు.. నిబద్దత, క్రమశిక్షణతో డ్యూటీ చేస్తోన్న వారిపై దౌర్జన్యం చేయడం బాధాకరం అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం అన్నారు. ఇక నుంచి ఎవరైనా TSRTC సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు.
ప్రజల మధ్య విధులు నిర్వర్తించే #TSRTC సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయి. నిబద్దత, క్రమశిక్షణతో డ్యూటీ చేస్తోన్న వారిపై దౌర్జన్యం చేయడం బాధాకరం. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం. వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. #TSRTC సిబ్బంది… https://t.co/yEhAbN2ALJ
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 22, 2024
ఆర్టీసీ డ్రైవర్ పై ప్రయాణికుడు దాడి
వికారాబాద్ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించి, ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. వికారాబాద్ డిపోలో సేవలు అందిస్తున్న డ్రైవర్ రాములు ఉదయం టిఫిన్ చేసేందుకు స్థానిక బస్టాండ్‌లో బస్సును నిలిపివేశాడు. టిఫిన్ తెచ్చుకుని కండక్టర్, డ్రైవర్ బస్సులోనే తింటున్నారు. నవాజ్ అనే ప్రయాణికుడు వచ్చి బస్సు ఆలస్యం కావడంపై సిబ్బందిని ప్రశ్నించాడు. తాము టిఫిన్ చేస్తున్నామని, ఓ ఐదు నిమిషాల్లో బస్సు బయలుదేరుతుందని డ్రైవర్ బదులిచ్చాడు. డ్రైవర్ రాములు మాటలు వినిపించుకోని ప్రయాణికుడు నవాజ్, డ్రైవర్‌ను దూషించాడు. ఆపై దాడికి పాల్పడ్డాడు. తోటి సిబ్బందిపై జరిగిన దాడిని ఆర్టీసీ సిబ్బంది తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు దాదాపు 50 వరకు బస్సులను నిలిపివేసి డ్రైవర్ రాములుకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు.
రాములుపై దాడి చేసిన ప్రయాణికుడు నవాజ్‌ను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. బస్టాండ్ లోనే దాడి జరగడంతో వెంటనే స్పందించిన ఆర్టీసీ అధికారులు నవాజ్ చేసిన దాడిపై వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో బస్సులు కదిలాయి. డ్రైవర్లు, కండక్టర్ల నిరసనతో పరిగి, తాండూరు, హైదరాబాద్ వెళ్లే ఆగిపోవడంతో ప్రయాణికులు కొంత సమయం ఇబ్బందులు పడ్డారు.