ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్
సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్స్‌కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాదులో వీళ్లని ట్రాన్స్ ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయంపై ట్రాన్స్ జెండర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీలో ఎలాంటి గౌరవం లేక అందరూ కలిసి ఓ చోట బతుకున్నారు వీళ్లంతా. ఈ ట్రాన్స్ జెండర్స్‌లో బాగా చదువుకున్న వాళ్లూ ఉన్నారు. కానీ...ఎవరూ ఉద్యోగం ఇవ్వక, ఉపాధి అవకాశాలు రాక అక్కడ ఇక్కడా డబ్బులు అడుగుతూ జీవనం సాగిస్తున్నారు. అవమానాలు ఎదురవుతున్నా ఇదే వృత్తిలో ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ట్రాన్స్‌జెండర్స్ అంతా హైదరాబాద్‌లోని ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడంలో భాగస్వాములు కానున్నారు. వాళ్లను వాలంటీర్లుగా నియమించనుంది ప్రభుత్వం. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ అయ్యాయియ ఆసక్తి, అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి...ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా గుర్తిస్తారు. ప్రత్యేక డ్రెస్ కోడ్ తో విధుల్లోకి తీసుకుంటారు.