RCB vs PBKS IPL 2025 Final | పంజాబ్ పై 6పరుగుల తేడాతో RCB సంచలన విజయం | ABP Desam
RCB ఫ్యాన్స్ అరచి మరీ చెప్పండి ఈ సాలా కప్ నమ్మదే. కొహ్లీ ఫ్యాన్స్ చించుకుని మరీ చెప్పండి కింగ్ ఖాతాలో ఐపీఎల్ కప్ ఉంది. 18ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణ...ఏళ్ల కేళ్లుగా చేస్తూ వస్తున్న పోరాటం..అన్నింటికీ సుదీర్ఘ విరామం తర్వాత ఫలితం దక్కింది. ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ ను ఓడించి ఆర్సీబీ సగర్వంగా కప్ అందుకుంది. కొహ్లీ కళ్ల వెంబడి పెట్టుకున్న కన్నీళ్ల సాక్షిగా..రజత్ పటీదార్ కెప్టెన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు తొలిసారి ఐపీఎల్ కప్ అందించి పెట్టాడు. 18 సంవత్సరాలుగా టీమ్ భారాన్ని ఒక్కడై మోస్తున్న కొహ్లీకి సరైన బహుమతి అందించింది రజత్ సేన. నరేంద్ర మోదీ స్టేడింలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ఆర్సీబీని 9వికెట్ల నష్టానికి 190 పరుగులకు కట్టడి చేసింది.35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కొహ్లీనే టాప్ స్కోరర్. అర్ష్ దీప్, కైల్ జేమిసన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. స్లోవర్ బంతులతో పంజాబ్ బౌలర్లు ఆర్సీబీని ఇబ్బంది పెట్టారు. 191 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన పంజాబ్…టాప్ 3 ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్, జోస్ ఇంగ్లిస్ ఫర్వాలేదనిపించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. కృనాల్ పాండ్యా యశ్ దయాల్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో పంజాబ్ మిడిల్ ఆర్డర్ ను క్లచ్ ఆపింది ఆర్సీబీ. శ్రేయస్ అయ్యర్ 1 పరుగుకే అవుట్ అవటం ఆర్సీబీని మ్యాచ్ లో సగం గెలుపును ఇచ్చింది. చివర్లో శశాంక్ సింగ్ 30 బంతుల్లో 3 ఫోర్లు 6 సిక్సులు 61 పరుగులు కొట్టినా మరో ఎండ్ లో సపోర్ట్ చేసే వాళ్లు లేకపోవటంతో ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీని విజయం వరించి తొలిసారిగా విరాట్ కొహ్లీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు.





















