Avani Lekhara Gold Medal Inspiring Journey | పారాలింపిక్స్ లో గోల్డ్ కొట్టి చరిత్ర సృష్టించిన అవనీ
11 ఏళ్ల చిన్న వయస్సులో యాక్సిడెంట్ అయ్యింది. స్పైనల్ కార్డ్ దెబ్బతిని నువ్వు జీవితంలో లేచి నడవలేవు. తిరగలేవు. అసలు లేచి కూర్చోవటమే ఎక్కువ అన్నారు. అంత చిన్న వయస్సులో ఆ పాపకు ఎంత కష్టంగా ఉంటుంది. జీవితం ఒక్కసారిగా మోయలేని భారాన్ని మీద పడేసిట్లు ఉంటుంది. కానీ ఆ పాప కోలుకుంది. అలా ఇలా కాదు. షూటింగ్ అంటే తనకున్న ఆసక్తినే తన లక్ష్యంగా మార్చుకుంది. ఫలితం ఆటలోకి అడుగుపెట్టిన పదేళ్లలో రెండు ఒలింపిక్స్ లో వరుసగా రెండు బంగారు పతకాలు కొట్టి తనేంటో ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. తన పేరే అవనీ లేఖారా. 23ఏళ్ల వయస్సు. పన్నెండేళ్ల కారు ప్రమాదం ఆమె జీవితాన్ని మార్చేసినా తండ్రి సాయంతో కోలుకుని తిరిగి ఈ ప్రపంచంపై దృష్టి సారించింది. భారత్ కు షూటింగ్ లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన అభినవ్ బింద్రా స్ఫూర్తితో షూటింగ్ వైపు అడుగుపెట్టింది. 2015లో ప్రొఫెషనల్ షూటర్ గా మారింది. 2020లో జరిగిన టోక్యో పారాలింపిక్స్ కు అర్హత సాధించిన అవనీ లేఖారా పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో బంగారు పతకం సాధించిన ఈ విభాగంలో తొలి బంగారుపతకం సాధించిన తొలి భారత పారాలింపియన్ గా చరిత్ర సృష్టించింది. అంతటి ఆగలేదు. అదే షూటింగ్ లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు కొట్టినా తన లక్ష్యాన్ని మరింత గా పదును చేసి నిన్న జరిగిన పారిస్ పారాలింపిక్స్ లోనూ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో బంగారు పతకం మళ్లీ కొట్టింది. ఇలా రెండు పారాలింపిక్స్ లో వరుసగా రెండు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా తిరుగలేని చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది అవనీ లేఖారా.2022లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవాన్ని అందుకుని అవనీ...ప్రస్తుతం రాజస్థాన్ యూనివర్సిటీలో లా చదువుతోంది. ప్రమాదం జరిగిందని కుంగిపోకుండా వీల్ ఛైర్ లో కూర్చునే దేశానికి రెండు బంగారు పతకాలను సాధించి గర్వకారణంగా నిలిచింది అవనీ లేఖారా