YCP Leader: ల్యాండ్ కబ్జా చేసి...అడ్డొచ్చిన అధికారులను బాది..పెందుర్తి వైసీపీ లీడర్
విశాఖ జిల్లా పెందుర్తి మండలం లో వైసిపి నేతల భూదందాలు పరాకాష్టకు చేరుకున్నాయి. పెందుర్తి మండలం సత్తివాని పాలెం గ్రామంలో సర్వే నెంబర్ 355 చెందిన గడ్డ వాగును పలువురు వైసీపీ నేతలు ఆక్రమించారు. వైసీపీ వెస్ట్ నియోజకవర్గ ఇన్‌చార్జి మళ్ళా విజయ ప్రసాద్ అనుచరులు 80 సెంట్లు భూమిని ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సమాచారం అందుకున్న రెవెన్యూశాఖ అధికారులు అయిన పెందుర్తి ఆర్.ఐ, ముగ్గురు వీఆర్వో లు ఆక్రమణలను తొలగించడానికి వెళ్లారు. అయితే ఆక్రమణలను తొలగిస్తున్న వారిపై 89వ వార్డ్ వైసీపీ ఇంచార్జ్ దొడ్డి కిరణ్, అతని అనుచరులు గురువారం దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంటే వైసీపీ నాయకులు తమపై ఈ రకంగా దాడులకు పాల్పడటం ఏంటని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు బాధిత సిబ్బంది. రెవెన్యూ అధికారులు పై దాడి పట్ల విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ సీరియస్ అయ్యారు. నిందితుడిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలంటూ పోలీస్ కమీషనర్ కు లేఖ రాశారు కలెక్టర్. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి....పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు. పరిస్థితి గమనించిన నిందితుడు దొడ్డికిరణ్ అతని మనుషులు పరారీలో ఉన్నారు.