Third Wave : వచ్చే రెండు వారాలు కీలకం
కరోనా ముప్పు తొలగిపోయిందని ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో... ‘ఇట్స్ మై టైం’ అంటూ ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతోంది. మూడో వేవ్ భయాలను అందరిలోనూ రేకెత్తిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతుండటంతో కరోనా నివారణలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ సాధారణ జలుబు లాంటిది కాదని, ఆరోగ్య వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపించొచ్చని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం మధ్యలో కరోనా ఉద్ధృతి గరిష్ఠానికి చేరుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.





















