రతన్ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?
రతన్ టాటా కన్ను మూసిన తరవాత ఆయన ఆస్తుల పంపకాలు ఎలా జరుగుతాయన్న చర్చ మొదలైంది. వీలునామాలో ఏం రాశారన్న ఆసక్తి నెలకొంది. ఈ మధ్యే ఈ వీలునామాకి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రతన్ టాటా తన ఆస్తుల్ని ఎవరికి ఎలా పంచారో ఇందులో వివరించారు. మొత్తం పది వేల కోట్ల రూపాయ ఆస్తిలో కొంత భాగాన్ని ట్రస్ట్‌కి కేటాయించారు రతన్ టాటా. సోదరుడు జిమ్మీటాటాతో పాటు ఇంట్లో పని చేసే ఉద్యోగులు, బంధువులకూ వీలునామా రాశారు. అయితే...అన్నింటి కన్నా ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే...ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క టిటోకి కూడా ఆస్తిని పంచి ఇచ్చారు టాటా. అది బతికున్నంత కాలం నిర్వహణ ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని ఇస్తున్నట్టు వీలునామాలో ప్రస్తావించారు. కుక్కలంటే ఆయన ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ.
ఇక తన బెస్ట్ ఫ్రెండ్ శంతను నాయుడికి కూడా ఆస్తి పంచి ఇచ్చారు రతన్ టాటా. వృద్ధుల సంరక్షణ కోసం స్థాపించిన గుడ్‌ఫెలోస్ కంపెనీలో పెద్ద మొత్తంలో శంతనుకి షేర్స్ ఇచ్చారు. అంతే కాదు. తన ఎడ్యుకేషన్ కోసం శంతను తీసుకున్న లోన్ మొత్తం క్లియర్ చేశారు రతన్ టాటా. తన ఫ్రెండ్ ఇంకెప్పుడూ డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. వీళ్ల మధ్య బాండింగ్ ఎలాంటిదో మరోసారి ఈ వీలునామాతో రుజువైంది.