PM MODI Praises Vittalacharya: మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న విఠలాచార్య
కలలను నిజం చేసుకోవాడానికి వయసు అడ్డుకాదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అందరికీ ఆదర్శమన్నారు. చిన్నతనం నుంచి ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయాలనే కోరిక విఠలాచార్యకు ఉండేదన్న మోదీ.... చదువుకుని లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించిన దగ్గర నుంచి పుస్తకాలను సేకరించటం మొదలుపెట్టారన్నారు.అలా రిటైర్మెంట్ తర్వాత ఓ లైబ్రరీని ఏర్పాటు చేశారన్నారని స్థానిక యువతకు, వృద్ధులకు విజ్ఞానసంపదను అందిస్తున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేమల గ్రామంలో 1938 జూలై 9న జన్మించిన విఠలాచార్యకు చిన్న తనం నుంచి పుస్తక పఠనంపై చాలా ఆసక్తి ఉండేది. లెక్చరర్, ప్రిన్సిపల్‌గా పని చేసి రిటైరైన తర్వాత.... తాను నివాసం ఉంటున్న ఎల్లంకి గ్రామంలో 2014లో 4 వేల పుస్తకాలతో లైబ్రరీ స్టార్ట్ చేశారు విఠలాచార్య. ‘ఆచార్య కూరెళ్ల గ్రంధాలయం’ అన్న పేరుతో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న గ్రంధాలయంలో 2 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. విఠలాచార్య దాదాపు 20 పుస్తకాలు కూడా రాశారు.