జమిలి ఎన్నికల బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్‌ని మోదీ సర్కార్ వెనక్కి తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి ట్విస్ట్ ఇచ్చింది కేంద్రం. లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. అలా ఆ ప్రస్తావన తీసుకొచ్చారో లేదో..అప్పుడే సభలో గందరగోళం మొదలైంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అని ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సహా ఆర్‌జేడీ, టీఎమ్‌సీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు పేరుతో రాష్ట్రాల అసెంబ్లీ గడువులను కుదించడానికి ఏ మాత్రం అంగీకరించమని తేల్చి చెబుతున్నాయి. ఈ బిల్ అమల్లోకి వస్తే...ఎన్నికల సంఘానికి అధికారాలు పూర్తిగా పెరిగిపోతాయని వాదిస్తోంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. అయితే..కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్‌డీఏకి 295 మంది సభ్యుల బలం ఉంది. అటు ఇండీ కూటమికి 235 మంది సభ్యులున్నారు. లోక్‌సభలో ఈ బిల్ పాస్ అవ్వాలంటే 362 మంది ఎంపీల మద్దతు ఉండాల్సిందే. మొత్తంగా పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీని సాధిస్తే..ఈ బిల్ పాస్ అవడానికి వీలుంటుంది. అయితే..మూడింట రెండొంతుల మెజార్టీ లేనప్పుడు బిల్లుని ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష ఎంపీలు. ఈ కారణంగా సభలో గందరగోళం నెలకొంది.





















