Miss Universe: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు
భారతపతాకం మరోసారి విశ్వవేదికపై వెలుగులీనింది. విశ్వసుందరి కిరీటాన్ని భారతీయ వనిత దక్కించుకుంది. ఇరవై ఒక్కేళ్లు... మిస్ యూనివర్స్‌గా ఓ భారతీయ అందం మెరవడానికి పట్టిన కాలం. 2000లో లారాదత్తా మిస్ యూనివర్స్ గా గెలిచాక, మళ్లీ ఆ కిరీటం మనవారికి దక్కలేదు. ఇప్పుడు 2021లో హర్నాజ్ కౌర్ సంధు ఆ ఘనతను సాధించింది. ఆ సుదీర్ఘవిరామానికి హర్నాజ్ అందంగా ముగింపు పలికింది. 80 దేశాల నుంచి వచ్చిన అప్సరసలతో పోటీ పడి విశ్వ కిరీటాన్ని దక్కించుకుంది. మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయెల్ లో జరిగాయి. పోటీకి వెళ్లే ముందే హర్నాజ్ ‘కిరీటాన్ని తిరిగి భారతదేశం తెచ్చేందుకు శాయశక్తులా కష్టపడతా’ అని చెప్పి మరీ వెళ్లింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఈ పంజాబీ అందం.





















