లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరం
లెబనాన్‌లోని టైర్ సిటీపై ఇజ్రాయేల్ భీకర దాడులు చేసింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన ఈ నగరం.. బాంబుల మోతతో మారుమోగింది. దాదాపు నెల రోజులుగా ఇజ్రాయేల్, హెజ్బుల్లా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నెల రోజుల్లో ఇంత విధ్వంసం జరగడం ఇదే తొలిసారి. ఈ దాడులతో మొత్తం సిటీ అంతా వణికిపోయింది. దాడులు చేసే ముందే ఇజ్రాయేల్ అక్కడి పౌరులకు వార్నింగ్ ఇచ్చింది. వెంటనే నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఈ దాడుల కారణంగా నగరమంతా పొగ అలుముకుంది. ఇళ్లు, షాప్‌లు, పెద్ద పెద్ద బిల్డింగ్‌లు అన్నీ నేలమట్టమయ్యాయి. వాహనాలన్నీ తునాతునకలయ్యాయి. హెజ్బుల్లా యూనిట్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుని ఈ దాడులకు పాల్పడింది ఇజ్రాయేల్ ఆర్మీ.
ఈ నగరాన్నే టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం...హెజ్బుల్లాకి ఇది కంచుకోట కావడం. ఇరాన్ మద్దతునిస్తున్న ఈ హెజ్బుల్లా సభ్యులు టైర్ సిటీలోనే పెద్ద ఎత్తున మకాం వేశారని అంటోంది ఇజ్రాయేల్. అందుకే ఇక్కడే వరుస పెట్టి దాడులు చేసి దాదాపు 400 అపార్ట్‌మెంట్‌లని ధ్వంసం చేసింది. టైర్ సిటీలో దాదాపు 50 వేల జనాభా ఉంటుందని అంచనా. ఇక్కడ ముస్లింలతో పాటు క్రిస్టియన్స్ కూడా ఉంటారు. గత నెల రోజులుగా ఇజ్రాయేల్ దాడుల కారణంగా చాలా మంది సిటీ విడిచిపెట్టి వెళ్లిపోయారు.