Pune Bridge Collapse | ఇంద్రాయణి నదిపై కూలిన వంతెన.. పర్యాటకులు | ABP Desam
మహారాష్ట్రలోని పుణేలో పెద్ద ప్రమాదం జరిగింది. ఇంద్రాయని నదిపై నిర్మించిన వంతెన సగం కూలిపోయింది. వంతెన కూలిన సమయంలో చాలా మంది దాని మీద ఉన్నారు. దాంతో దాదాపు 25 నుంచి 30 మంది నదిలో పడి కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. పుణేలోని మావల్ లోని కుండ మాల్ లో ఇనుప వంతెన కూలిపోవడంతో కొంతమంది పర్యాటకులు నీటిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
కుండమాలను దాటడానికి ఒక వంతెన ఉంది, ఇక్కడ నుండి అటువైపు వెళ్లడానికి అదొక్కటే మార్గం. కానీ దురదృష్ణవశాత్తూ ఈ వంతెన కూలిపోయింది.
కొంతమంది ఇంద్రాయని నదిపై ఉన్న వంతెనపై నిలబడి ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. సంఘటనా స్థలంలో దాదాపు 200 మంది పర్యాటకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత, రెస్క్యూ ఆపరేషన్లకు ఏ ఇబ్బంది కలగకుండా పర్యాటకులను అక్కడి నుంచి తరలించారు.
ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న ఈ వంతెనపై కొంతమంది బైక్‌లతో చేరుకున్నారని తెలుస్తోంది. ఎక్కువ బరువును మోసే సామర్థ్యం లేక వంతెన కూలిపోయింది. వంతెన కండీషన్ సరిగ్గా లేదని గతంలోనే అధికారులకు ఫిర్యాదులు అందాయి. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వంతెన శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పుణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.





















