Kallakurichi Temple Demolition Viral Video | తమిళనాడులో వివాదాస్పదంగా మారిన గుడి కూల్చివేత దృశ్యాలు
అందరూ చూస్తుండగానే ఈ గుడిని కూల్చేశారు. జేసీబీలతో గోడలను పడగొట్టడంతో రాజగోపురం ఇలా కూలిపోయింది. తమిళనాడులోని కళ్లకురిచిలో జరిగింది ఈ ఘటన. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య ఈ రోజు కళ్లకురిచిలోని గాంధీ రోడ్డులో ఉన్న ఈ పిళ్లయ్యార్ అని పిలుచుకునే వినాయకుడి గుడిని కూల్చివేశారు. ఇక్కడ ఉండాల్సిన కాలువను ఆక్రమించి ఈ గుడితో 36 అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించారు. వాటన్నింటిని కూల్చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ఇలా ఆలయాన్ని పడగొట్టాల్సి వచ్చింది. నలభై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉండటంతో ఆ శాఖ అధికారులు కూడా కూల్చివేత సమయంలో అక్కడే ఉన్నారు. కానీ గుడిని కూల్చివేస్తున్న స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. పట్టణంలో మిగిలిన 36కట్టడాలను వదిలేసి ముందు గుడినే కూల్చేయటంపై అధికార పార్టీని విమర్శిస్తూ కొంతమంది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు నిరసనకారులను అదుపు చేశారు. గుడిని కూల్చి వేయటానికి ముందు ఆలయంలోని వినాయకుడి విగ్రహాలు సహా మిగిలిన విగ్రహాలను తరలించటానికి సమయం ఇవ్వాలని ప్రతిపక్ష ADMK నేతలు డిమాండ్ చేశారు. అప్పటి వరకూ గుడిని ముట్టుకోనివ్వమని ఆందోళన చేశారు. అయినా అధికారులు సమయం ఇవ్వలేదు. ఆలయంలోని ఆరు రాతి విగ్రహాలను, మూడు లోహపు విగ్రహాలను బయటకు తీసిన అధికారులు వాటిని స్థానికంగా ఉన్న మరియమ్మన్ ఆలయానికి తరలించారు. వెండి ఆభరణాలను, వస్తువులను ఆలయ అధికారులకు పోలీసులు అందచేశారు. వర్షం పడుతున్నా పనులు ఆపకుండా వానలోనే కూల్చివేతను కొనసాగించారు. ఆలయాన్ని నేలమట్టం చేశారు.