Delhi Railway Station Stampede Cause | ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘోర విషాదానికి కారణం ఇదే | ABP Desam
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట విజువల్స్ అక్కడి భయానకమైన పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. అసలు అర్థరాత్రి ఇంత మంది ప్రయాణికులు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో నిండిపోవటంపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సమాచారం తెలుస్తోంది. అప్పటికే రావాల్సిన రెండు ఎక్స్ ప్రెస్ లు ఆలస్యం అయ్యాయి. స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లు రద్దీ కారణంగా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటి కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు 12,13 ప్లాట్ ఫాంల పై అలాగే వేచి చూస్తున్నారు. ఈ లోగా ప్రయాగరాజ్ కు వెళ్లాల్సిన ఎక్స్ ప్రెస్ వస్తోందని రైల్వే అధికారులు అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పటికే గంటల తరబడి రైలు కోసం వేచి చూస్తున్న ఈ మూడు రైళ్లు ప్రయాణికులకు 1500లకు పైగా జనరల్ భోగీ టిక్కెట్లను అధికారులు అమ్మేశారు. రైళ్లు లేవని..ఒకే రైలు ఉందని చెప్పాల్సిన అధికారులు ప్రయాణికులకు ఆ మాట చెప్పకుండా టిక్కెట్లు ఇచ్చేశారు. ఇంతలో ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ 14వ ప్లాట్ ఫాం మీదకు వస్తోందని అనౌన్మెంట్ ఇచ్చారు. అంతే మూడు ప్లాట్ ఫాం లలో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ వైపు దూసుకువచ్చారు. భారీ తొక్కిసలాట జరిగింది. జనరల్ బోగీ లోకి వెళ్లేందుకు ఒకరిని ఒకరు నెట్టుకుంటూ వెళ్లే క్రమంలో మహిళలు, చిన్నారులు కిందపడిపోయారు. ఈ ఘోర విషాదంలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 11మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. 30 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈఘటనపై హై లెవల్ విచారణ కమిటీ వేశామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఢిల్లీలో నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నా ప్రయాణికుల కోసం 46ప్రత్యేక రైళ్లు వేసినా కోట్లాది మంది వెళ్లే కుంభమేళాకు ఉండే రద్దీ కారణంగా ఈ అనుకోని ఘటన జరిగిందిని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.





















