Governer Tamilisai: మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ను సందర్శించిన తెలంగాణ గవర్నర్
కేంద్ర రక్షణ రంగ సంస్థ -మిధాని ఉత్పత్తుల ప్రదర్శన చాలా బాగుందని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కాంచన్ బాగ్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో వారం రోజుల పాటు సాగిన రక్షణఉత్పత్తుల ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్షణ రంగానికి అవసరమైన క్షిపణులు, యుద్ధ విమానాలు,రైల్వే కు కావలసిన పరికరాలను ఉత్పత్తులు చేసే మిధాని ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలతో ముందు దూసుకుపోతుందన్నారు. గతంలో విదేశాల నుండి దిగుమతులు చేసుకునే స్థాయి నుండి ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయడం ఎంతో గర్వకారణమన్నారు. మిధానిలో మిసైల్స్ పనిచేసే విధానం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను గవర్నర్ ఆసక్తిగా తిలకించారు.





















