ఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?
భారత్, చైనా తగువు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో దశాబ్దాల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. గల్వాన్ ఘటన తరవాత ఈ ఘర్షణ ఇంకాస్త పెరిగింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించేందుకు కమాండర్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కానీ..ఈ సారి ఏకంగా ఇరు దేశాల అధినేతల మధ్య చర్చ జరిగింది. రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. చివరి సారి 2019లో మహాబలిపురంలో ఈ ఇద్దరూ సమావేశమయ్యారు. ఐదేళ్ల తరవాత ఇప్పుడు మళ్లీ భేటీ అయ్యారు. పైగా సరిహద్దు వివాదం ముదిరిన నేపథ్యంలో వీళ్లిద్దరూ ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఇద్దరు నేతలూ ఏం మాట్లాడారంటే..
జిన్‌పింగ్: ప్రధాని మోదీజీ మిమ్మల్ని ఇక్కడ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఐదేళ్ల తరవాత తొలిసారి ద్వైపాక్షిక సమావేశం జరుగుతోంది. మన సమావేశంపై అంతర్జాతీయంగా ఎంతో ఆసక్తి నెలకొంది. గ్లోబల్ సౌత్‌లో భారత్, చైనా కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేందుకు ఇదే సరైన సమయం. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లడం మంచిదని భావిస్తున్నాం. పరస్పరం సహకరించుకోవాలి. ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య దేశాలకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను.
ప్రధాని మోదీ: మిమ్మల్ని కలుసుకోవడం నాకూ ఆనందంగానే ఉంది. ఐదేళ్ల తరవాత జరుగుతున్న సమావేశమిది. భారత్ చైనా మధ్య మైత్రి అనేది కేవలం మన రెండు దేశాలకే సంబంధించింది కాదని నా అభిప్రాయం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వానికి ఇది ఎంతో కీలకమైంది. గత నాలుగేళ్లలో సరిహద్దులో ఎన్నో ఘటనలు జరిగాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి శాంతి, స్థిరత్వం కోసం ప్రయత్నించాల్సిన అవసరముంది. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవాలి. ఈ వేదికగా వీటి గురించి చర్చించుకునే అవకాశం వచ్చింది. ఎలాంటి దాపరికాలు లేకుండా ఈ చర్చలు కొనసాగుతాయన్న నమ్మకముంది.