(Source: ECI/ABP News/ABP Majha)
Jani Master National Award Thiruchitrambalam | జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ | ABP Desam
నెల్లూరులో మెకానిక్ గా పనిచేసే ఓ కుర్రాడు తనలో ఉన్న డ్యాన్సర్ ను చంపుకోలేకపోయాడు. జేసీబీ ఆపరేటర్ గానూ పనిచేసిన అదే కుర్రాడు కడుపు కాలుతున్నా కళనే నమ్ముకోవాలని డిసైడ్ అయ్యాడు. సైడ్ డ్యాన్సర్ గా, మెయిన్ డ్యాన్సర్ గా, టీమ్ లీడర్ గా టీవీ రియాల్టీ షోల్లో తన ప్రస్థానం ప్రారంభించిన జానీ మాస్టర్ ఈరోజు జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డుకు ఎంపికయ్యాడు. తమిళంలో 2022లో విడుదలై సూపర్ హిట్ అయిన ధనుష్, నిత్యామీనన్ జంటగా నటించిన తిరు చిత్రాంబళం సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎంపికయ్యాడు. తిరు పేరుతో తెలుగులోనూ విడుదలైన ఆ సినిమాలోని మేఘం కరిగేనా పాటకు గానూ జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ కు ఈ అవార్డు దక్కింది. అప్పట్లో ఇన్ స్టా రీల్స్ లోనూ సోషల్ మీడియాలోనూ జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ స్టెప్పులే హల్ చల్ చేశాయి. ద్రోణ సినిమాలో ఏం మాయ చేశావే సాంగ్ తో కొరియో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన జానీ మాస్టర్ రామ్ చరణ్ పెద్ద సినిమా అవకాశాలు ఇవ్వటంతో తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు. చరణ్ తో పాటు అల్లు అర్జున్, ఎన్టీఆర్, తమిళ్ లో విజయ్, ధనుష్ లకు కొరియో గ్రాఫ్ చేశారు జానీ మాస్టర్. జనసేన పార్టీలో చేరటం ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జానీ మాస్టర్ డ్యాన్స్ లో ఇన్నేళ్లు పడిన కష్టానికి జాతీయ స్థాయిలో ఇప్పుడు గుర్తింపు లభించింది. వాస్తవానికి అలవైకుంఠపురం సినిమా అప్పుడే అవార్డు వస్తుందనుకున్నా అప్పుడు నిరాశే ఎదురైంది. ఇప్పుడు తిరు సినిమాతో నేషనల్ అవార్డు దక్కింది.