CM Jagan Button Strategy | బటన్లు నొక్కినా..నే...రుగా ఖాతాలో డబ్బులు వేసినా
మీ బిడ్డ బటన్ నొక్కాడు....నే....రుగా మీ ఖాతాలోకి డబ్బులు పడిపోయాయి. గడచిన ఐదేళ్లలో ఇదే స్క్రిప్టు. ఏ మీటింగ్ కి వెళ్లినా..ఏ సభలో అయినా దానికి కాంటెక్ట్స్తో సంబధం లేకుండా జగన్ మాట్లాడే మాట ఇది. అయితే క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్లు నొక్కటం లేదంటే ఏదైనా జిల్లా సభపెట్టి బటన్లు నొక్కటం..దాన్నే పదే పదే ప్రస్తావించటం ఇదే జరిగింది ఐదేళ్లుగా. బటన్ నొక్కితే అభివృద్ధి జరిగిపోతుందా.. సంక్షేమ పథకాలతో నేరుగా డబ్బులు అకౌంట్లలోకి వేసేస్తే ప్రజల జీవితాలు బాగుపడిపోతాయా టీడీపీ జనసేన తరచుగా అడుగుతూనే వచ్చింది. ప్రజల డబ్బులు ప్రజలకే తిరిగి ఇస్తూ సొంత ఆస్తి ఏదో జనాలకు పంచిపెడుతున్నట్లు సీఎం జగన్ మాట్లాడుతున్నారంటూ ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రజలు ఓట్ల రూపంలో మద్దతు పలికారు. బటన్లు నొక్కితే ఓట్లు పడవన్నాయ్ అనటానికి నిదర్శనంగా కూటమికి భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ జోడెద్దుల్లా రాష్ట్ర ప్రగతిని డిసైడ్ చేయాలి కానీ ఒకటి మాత్రం పట్టుకుని మరొకటి వదిలిస్తే రాష్ట్రం ఏ విధంగా తయారవుతుందో గడిచిన ఐదేళ్లలో ప్రజలంతా చూశారు. అందుకే తమ ఓటుతో దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు. 151 సీట్లతో అఖండమైన మెజారిటీ ఇచ్చిన చోటే..గత ఎన్నికల్లో టీడీపీ సాధించిన సీట్లు పొందేందుకు వైసీపీ నానా తంటాలు పడింది. ప్రజల్లో ఉన్న రాజకీయ చైతన్యం..రాష్ట్ర అభివృద్ధి పై వారికున్న నిర్దిష్టమైన అభిప్రాయాలు వెరసి కూటమికే సై అనేలా చేసింది. డబ్బులు పంచేస్తే ఓట్లు పడిపోవని..సీఎం జగన్ కు సైతం తెలిసొచ్చేలా ఏపీ ఓటర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ ఇచ్చే తీర్పుకు ఎంత పవర్ ఉంటుందో తెలిసేలా మరోసారి అర్థమయ్యేలా ఈ సారి ఏపీ ఎన్నికల రిజల్ట్స్ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశాయి. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పాలకులు సరిగ్గా వినియోగించుకోకపోతే ఓడలు బళ్లు బళ్లు ఓడలు అవటానికి పాలకులే కాదు ప్రజలు కూడా బటన్లు నొక్కి భవితవ్యం మార్చగలరని తెలిసేలా చేశాయి.