MLA RK Roja: అయ్యన్న పాత్రుడిపై ఎమ్మెల్యే రోజా ఫైర్
ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లదాడి చేసుకున్నారు. అసలు ఈ వ్యవహారం అంతటికీ మూలం సీఎం జగన్ పై మాజీమంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కోడెల వర్థంతి సభలో చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తాజా అయ్యన్నపై నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని రోజా అన్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సినిమా టికెట్లు ఆన్లైన్ విక్రయంపై
అనంతరం ఆలయం బయట ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు కోడెల శివప్రసాద్ కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేశారన్నారు. అప్పుడు అయ్యన్న ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్ ని చూసి నేర్చుకోవాలని ప్రతిపక్షాలకు ఆమె హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, అయ్యన్న పదవులు లాగేశారని ఎద్దేవా చేశారు. సినిమా టిక్కెట్లు ఆన్లైన్ లో విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి మద్దతిస్తున్నట్లు చెప్పారు. చిరంజీవి, నాగార్జున పరిశ్రమ పెద్దలు సినిమా టికెట్లు ఆన్లైన్ ద్వారా విక్రయించాలని కోరడంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని రోజా తెలియజేశారు.