Tirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP Desam
తిరుమల ఘాట్ రోడ్డును ఎప్పుడైనా పరిశీలించారా..అంత పెద్ద కొండల మీదకు రోడ్డును అసలు ఎలా వేశారు. శేషాచలం అటవీ అందాలలో ఘాట్ రోడ్డు ప్రయాణం ఇప్పుడు ఆహా అనిపిస్తున్నా...ఈ ఇంజినీరింగ్ అద్భుతం వెనుక ఉంది ఎవరు. ఇంజినీర్స్ డే సందర్భంగా ఈ వీడియో మీ కోసం. పూర్వం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలంటే కాలినడకన దట్టమైన అడవి లో పాదయాత్రగా వెళ్లటం తప్పమరో దారి లేదు. క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరగడం, తిరుమల కు కావాల్సిన వస్తువులు తీసుకురావడానికి సౌకర్యాలు లేకపోవటంతో అప్పటి మద్రాసు పాలకుల సూచన మేరకు ఓ రోడ్డు వేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే తల ఎత్తి చూస్తే అంత ఎత్తైన కొండల్లో రోడ్డు వేయడం అంటే సాధ్యమేనా అని అందరూ అనుకున్నారు. అలాంటి సందర్భంలో నాటి మద్రాసు గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ ఈ పనిని ఓ ప్రముఖ ఇంజనీర్ కు అప్పగించారు. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ కొండల్లో సర్వే నిర్వహించిన మోక్షగుండం వారు ఓ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత పనులను ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో రోడ్డు వేయడం అనేది ఒక సవాలు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్యే ట్రయల్ రన్ కూడా నిర్వహించారని చెబుతారు. దీనినే నేటికి మనం వినియోగిస్తున్నాం. తిరుమల నుంచి తిరుపతి కి కిందకి దిగే రోడ్డునే మొదటి ఘాట్ రోడ్డుగా పిలుస్తారు. ఆ రోజుల్లో రాకపోకలు ఈ రోడ్డులోనే సాగేవి.