Tadipatri Issue Police Alert | కౌంటింగ్ రోజు దగ్గర పడుతుండటంతో పోలీసుల అలెర్ట్ | ABP Desam
పోలింగ్ రోజు తాడిపత్రిలో జరిగిన ఘటనపై పోలీసులు ఇంకా దూకుడు పెంచుతూనే ఉన్నారు. సిట్ దర్యాప్తు పూర్తైనా ఎన్నికల కౌంటింగ్ రోజు దగ్గర పడుతుండటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తాడిపత్రి అల్లర్ల ఘటనలో పాల్గొన్న 106మంది రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. వేర్వేరు ఘటనల్లో మరో 53మందిపై కలిపి ఒక్క రోజే తాడిపత్రి పీఎస్ పరిధిలో 159మంది రౌడీషీట్లు ఓపెన్ అయ్యాయి. ఈవీఎంలు భద్రపరిచిన కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఇదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ సహా.. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో భద్రతను పర్యవేక్షించనున్నారు. జిల్లాల్లోని అన్ని కౌంటింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కేంద్రాల వద్ద హైస్పీడ్ ఇంటర్నెట్, టేబుళ్ల నిర్వహణ, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఈవో ఎంకే మీనా ఆదేశించారు. కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బందికి, అధికారులకు, ఏజెంట్లకు, నియోజకవర్గం అభ్యర్థులకు అల్బాహారం, భోజనం, మంచినీళ్లు సహా ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి ఉండదు. వీటిని భద్రపరిచేందుకు ప్రతి కేంద్రంలోనూ ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు.