ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, అప్పటి వరకూ ప్రాణాలు అరచేతుల్లో
ఉత్తరాంధ్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్టణంలో కురుస్తున్న వానలకు కొండ చరియలు విరిగి పడుతున్నాయి. గోపాలపట్నంలో భారీ కొండ చరియ విరిగి పడింది. కొండ కింద ఇళ్లలో ఉంటున్న వాళ్లంతా భయంతో వణికిపోతున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ఇళ్లను ఖాళీ చేయించారు. ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విజయనగరంలో కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలూ మునిగిపోయాయి.
జలాశయాలకు వరద పోటెత్తుతోంది. మరి కొన్ని చోట్ల జలపాతాలు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అల్లూరి జిల్లాల్లోని కొత్తపల్లి జలపాతం ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతోంది. విశాఖ లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి జ్ఞానపురం బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు కోస్తాంధ్రలోనూ 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.