5శాతం జీఎస్టీ చాలు....12శాతం వద్దంటున్న వ్యాపారులు..
బెజవాడ లో వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. వస్త్రాలపై జీఎస్టీ 5 నుండి 12శాతం పెంచడంపై వ్యాపారులు మార్కెట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు ఏపీ టెక్స్టైల్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శులు బచ్చు వెంకట లక్ష్మీ ప్రసాద్, బిజేపీ శ్రీనివాస్ నేతృత్వం వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వస్త్రాలు అనేవి ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. అలాంటి వస్త్ర రంగంపై వ్యాట్ ట్యాక్స్‌లు వేశారని, కేంద్రం ఐదు శాతం జీఎస్టీ వేసి మరింత భారం మోపిందని మండిపడ్డారు. ఇప్పటికే వ్యాపారాలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తాజాగా కేంద్రం జీఎస్టీని ఐదు నుండి 12 శాతానికి పెంచారన్నారు. జనవరి 1 నుండి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యాపారులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వినియోగదారులపై కూడా రెట్టింపు భారం పడుతుందని తెలిపారు. ఐదు శాతం జీఎస్టీ తగ్గించమంటే,12 శాతం పెంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఐదు లక్షల సరుకు కొనుగోలు చేస్తే అరవై వేలు జీఎస్టీ కట్టాలన్నారు. ఇలా అయితే వస్త్ర రంగం పూర్తిగా దెబ్బ తింటుందని అన్నారు. కేంద్రం పునరాలోచన చేసి జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.