దేశంలోనే అరుదైన ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న అరసవల్లి
ప్రభాత వేళలో ప్రత్యక్షమై ప్రపంచానికి మేలు కొలిపే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. సకల లోకాలకు తన వెలుగుల ద్వారా దివ్యతేజస్సును ప్రసాదించే దేవ దేవుడు.... అరసవల్లి సూర్యనారాయుడు. ఆయన కొలువైన ప్రదేశం శ్రీకాకుళం. ఈ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న అరసవల్లిలో శ్రీసూర్యనారాయణస్వామి భక్తులకు అభయప్రదానం చేస్తున్నాడు. రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా ఇక్కడ కనువిందు చేస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం గోచరిస్తుంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీలు, అలాగే దక్షిణాయనంలో అక్టోబరు 1, 2 తేదీల్లోనూ సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకుతాయి.