World Nature Conservation Day:జులై 28-ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినం
జులై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినం. ఈ సందర్భంగా ఏబీపీ దేశం ప్రత్యేక కథనం....
పంచభూత హిత క్షేత్రం ఇది. జరిగే ప్రతి చర్యకి, చేసే ప్రతి ఖర్మకి సాక్ష్యం ఉంటుందిక్కడ. ప్రకృతిని మన చేతులతో మనం నాశనం చేసుకుని అందుకు ఫలితం అనుభవిస్తున్నాం. అందుకే ప్రకృతిని కాపాడాలంటూ ప్రత్యేక దినోత్సవాలు నిర్వహిస్తున్నాం.
జనాభా పెరిగింది...జీవనశైలిలో మార్పులొచ్చాయి. మానవ కార్యకలాపాలు పెరగడంతో సహజ వనరులు తగ్గిపోవడంతో పాటూ....వృథా చేయడం కూడా జరుగుతోంది. దీని వల్ల పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతోంది. భూమిపై జీవులు బతకాలంటే సహజవనరులైన గాలి, నేల,నీరు, మొక్కలు, ఖనిజాలు, సహజ వాయువులు, సమ స్థితిలో ఉండాలి. జనాభా పెరుగుదల, అవగాహన లేమి, నిర్లక్ష్యం వలన సహజ వనరులు తగ్గిపోవడంతో, ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిని అనారోగ్యం సమస్యలు మొదలయ్యాయి. అందుకే ఏటా జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు. భవిష్యత్‌తరాల శ్రేయస్సు కోసం... సహజ వనరులను పొదుపుగా వాడుకుంటూ దుర్వినియోగం చేయకుండా ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని సమాజానికి అందించే దిశలో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం.
ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది....మనం నిర్లక్ష్యం వహిస్తే మనపైనా నిర్లక్ష్యం వహిస్తుంది.
వాయువుతోనే ఆయువు ఆరంభం ...వాయువుతోనే ఆయువు అంతం ...నడుమన గడిచేదే నరుని జీవితం అంటారు. కానీ ఆ వాయుని కలుషితం చేస్తున్నాం. విచక్షణారిహతంగా అడవులు నరికేస్తున్నాం.
తత్ర గంగవతి పృథివి-నిత్య సహనవతి పృథివి
స్వచ్ఛ ప్రేమవతి పృథివి-స్థైర్య శక్తిమతి పృథివి..వందేహం... పృథ్వి మాతరం
బుడి బుడి అడుగుతో మొదలై ఎన్నడుగులేసినా ...భూమిలో ఆరడుగులే శాశ్వతం. మరి దేనికోసం ఆరాటం...సహజ ఖనిజాలను కొల్లగొడుతున్నాం.. అభివృద్ధి పేరిట కర్మాగారాలు పెంచేస్తూ పరిసరాలను కాలుష్యంతో నింపుతున్నాం. దీని వల్ల పీల్చే గాలి నుండి తినే ఆహారం వరకు ప్రతిదీ కలుషితం అయిపోయి రోగాల బారిన పడుతున్నాం. కాలుష్యం వలన గ్లోబల్‌వార్మింగ్‌ఎక్కువై భూగ్రహం అతిగా వేడెక్కడం వలన, వన్య ప్రాణులు చనిపోతున్నాయి. మానవుని కార్యకలాపాల వల్ల ఓజోన్‌పొరకు నష్టం వాటిల్లింది. మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం.
గంగేచ యమునేచైవౌ గోదావరీ సరస్వతిమ్
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ... అని నీటిని పూజించే సంస్కృతి మనది.
అయితే దాహం తీర్చే నీటిని కలుషితం చేస్తున్నాం...వృధా చేస్తున్నాం. నదుల నుంచి ఇసుక తరలిస్తున్నారు. నదీతీరాలు ఆక్రమణకు గురి అవుతున్నాయి. అందువల్ల నదీ ప్రవాహాలు దారి మార్చుకుని ముంపుకు వరదలకు కారణమవుతున్నాయి.
మానవుని ప్రకృతి విరుద్ధమైన పనుల వలన సహజ వనరులను కోల్పోతున్నాం. పెట్రోలు, విద్యుత్, వినియోగంలో పొదుపు పాటించాలి. కొండలు, గుట్టలు, రాళ్లు రప్పలు, వాగులు వంకలు, అడవులు, ఇసుకతిన్నెలు, ఇవి అన్నీ కూడా సహజ వనరులే. వాటన్నింటినీ రక్షించుకోవడం మన బాధ్యత.ఖనిజాలను తవ్వితీయడానికి అడవులను నరికేస్తారు. రహదారులు, భవనాల నిర్మాణం కోసం ఎన్నో చెట్లను అడ్డదిడ్డంగా నరికేస్తున్నారు. చెరువులు, కాలువలు, ఆక్రమించి చదునుచేసి, వనాలు నిర్మిస్తున్నారు. కొండలను పిండిచేసి కంకర కుప్పలుగా మారుస్తున్నారు. ఎక్కడుందీ ప్రకృతి సమతుల్యత.
ఇప్పటికైనా మేల్కోవాలి. సహజ వనరులను, పర్యావరణాన్ని, రక్షించుకోవడం అత్యావశ్యకం. దీనికి 4 ఆర్‌సూత్రాన్ని పాటించాలి. తగ్గించడం(రెడ్యూస్), తిరిగి వాడటం(రీ యూజ్), పునఃచక్రీయం(రీసైకిల్), తిరిగి ఏర్పాటు చేయడం (రికవరి) అనే వాటిని మన జీవన విధానంలో భాగంగా బాధ్యతను స్వీకరించి పర్యావరణ వినాశనం కొంతవరకు నియంత్రించవచ్చు.