YS Sharmila: పుల్లెంలలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని పుల్లెంల గ్రామంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.
నిరుద్యోగ నిరాహార దీక్షను నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని పుల్లెంల గ్రామంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రారంభించారు. అంతకుముందు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి శ్రీకాంత్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి.. చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం.. నిరాహార దీక్షను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించనున్నట్లు గతంలో షర్మిల చెప్పారు. నిరుద్యోగులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నా.. కేసీఆర్ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని షర్మిల విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 50 వేల ఉద్యోగాలు చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు. నిరుద్యోగులకు అండగా నిలబడతానని గతంలోనే హామీ ఇచ్చారు.
మెుదట జులై 20న వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకున్న కొండల్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులు.. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై తెలుసుకున్నారు. కుమారుని మృతితో గుండెలవిసేలా రోదిస్తున్న వారిని షర్మిల ఓదార్చారు. వారి కడుపుకోత చూసి షర్మిల కంటతడి పెట్టారు. అనంతరం కొండల్ ఇంటి నుంచి తాడిపర్తి బస్టాండ్కు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు.
రాజన్న సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమంటూ.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రంగ ప్రవేశం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీని జులై 8న ప్రకటించనున్నారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. జగనన్న బాణం షర్మిల అని విమర్శించిన వారికి.. తాను తెలంగాణ బాణం అని సమాధానం చెప్పారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వీట్లు, విందులు పెట్టుకున్నారని పార్టీ ప్రకటన రోజు షర్మిల విమర్శించారు. మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. రెండు నిమిషాలు కూర్చుని సమస్య పరిష్కరించుకోలేరా అని నిలదీశారు. ఏపీ రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే కేసీఆర్ ఇప్పుడే కళ్లు తెరిచారా? అని విమర్శించారు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం చూస్తూ కూర్చుందని షర్మిల అన్నారు. సమస్య పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదన్నారు. న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టునూ వదులుకోమని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతానికి చెందిన నీటిచుక్కను కూడా తీసుకోమని షర్మిల అన్నారు. తాను కూడా పాదయాత్ర చేస్తానని.. పార్టీ ప్రకటించిన రోజే షర్మిల చెప్పారు.