PM Modi Requests Girl : ప్రధాని మోదీని టెన్షన్ పెట్టిన యువతి, ఫ్లడ్ లైట్ల టవర్ ఎక్కి హల్‌చల్
Lady Hulchul: విశ్వరూప మహాసభలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఆ సమయంలో ఓ యువతి.. తీవ్ర భావోద్వేగానికి గురైంది. సభా ప్రాంగణంలో ఉన్న ఫ్లడ్‌లైట్ స్తంభం ఎక్కేసింది.
Women Hulchul: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో శనివారం సాయంత్రం ఎస్సీ ఉప కులాల విశ్వరూప మహాసభ అట్టహాసంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) సభకు హాజరై ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రసంగించారు. ఆ సమయంలో ఓ యువతి.. తీవ్ర భావోద్వేగానికి గురైంది. సభా ప్రాంగణంలో ఉన్న ఫ్లడ్‌లైట్ స్తంభం ఎక్కేసింది. పరిస్థితిని గమనించిన ప్రధాని మోదీ.. ‘ అమ్మా కిందకు దిగు. ఇలా చేయడం మంచిది కాదు. మీకు అండగా నేనున్నాను. నీ మాట వింటాను. ఇలా చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు తల్లి. మీ మీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీరు మందకృష్ణ మాట వినాలి’ అని సర్ధిచెప్పారు. దీంతో యువతి స్తంభంపై నుంచి కిందకు దిగింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత మోదీ తన ప్రసంగం కొనసాగించారు.
అన్ని పార్టీలు మోసం చేశాయి
రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని విమర్శించారు. దళితులకు మూడుకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి.. ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. దళితబంధు ఎంతమందికి వచ్చిందో ఆలోచించాలన్నారు. అవకాశ వాద రాజకీయాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు దళిత విద్రోహ పార్టీలని ధ్వజమెత్తారు. అంబేద్కర్‌ను వ్యతిరేకించి ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.
మాదిగలకు న్యాయం చేస్తా
సెంట్రల్ హాల్‌లో అంబేద్కర్ చిత్ర పటాన్ని కాంగ్రెస్ పెట్టనివ్వలేదని ఆరోపించారు. ఇకపై మాదిగలు ఏమీ అడగాల్సిన పనిలేదన్నారు. దళితుడైన రామ్ నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేశామన్నారు. దళితుడిని రాష్ట్రపతి చేయడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లతో అణచివేయబడ్డ మాదిగల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మాదిగ వర్గానికి తాను అండగా ఉంటానని, తన సోదరుడు మంద కృష్ణ మాదిగతో కలిసి మాదిగ వర్గానికి న్యాయం జరిగేలా పనిచేస్తానన్నారు.
మనుషుల్లా చూడలేదు
మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) మాట్లాడుతూ.. మాదిగలను సమాజంలో మనుషులుగా చూడలేదని, తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను పశువుల కంటే హీనంగా సమాజం తమను చూసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వరూప సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మాదిగల సమస్యల్ని తెలుసుకునేందుకు దేశానికి పెద్దన్న అయిన ప్రధాని మోదీ వచ్చారంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లా మాటలు చెప్పే పార్టీ బీజేపీ కాదని మందకృష్ణ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల సామాజిక న్యాయం కేవలం ఉపన్యాసాలకు పరిమితమైందని విమర్శించారు. బీసీని సీఎం చేస్తానని చెప్పిన దమ్మున్న నేత, అంబేద్కర్ స్ఫూర్తితో దేశానికి సామాజిక న్యాయం చేస్తున్న వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన బీసీ వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారు. తెలంగాణ గడ్డమీద సైతం బీసీ బిడ్డను సీఎం చేస్తానని మోదీ చేసిన ప్రకటన తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.