Women Congress: అలాన్ వాకర్ సన్ బర్న్ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం : మహిళా కాంగ్రెస్
Women Congress: అలాన్ వాకర్ సన్ బర్న్ లైవ్ ప్రదర్శనను అడ్డుకుంటామని టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ఛైర్ పర్సన్ సునీతా రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని అబ్కారీ శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందించారు.
Women Congress: తెలంగాణలో రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు, డ్రగ్స్ పెరుగుతున్నాయని.. సన్ బర్న్ పేరుతో తలపెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేయాలని టీపీసీసీ మహిళ కాంగ్రెస్ ఛైర్ పర్సన్ సునీతా రావ్ డిమాండ్ చేశారు. సన్ బర్న్ ఎరీనా సెప్టెంబర్ 23న శంషాబాద్ జీఎంఆర్ ఎరీనాలో జరగనుంది. శంషాబాద్ లో సన్ బర్న్ పేరుతో తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసే విధంగా చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను కలిసి సన్ బర్న్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ అండ దండలతో మద్యం ఏరులై పారుతోందని.. డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయని సునీతా రావు విమర్శించారు. తెలంగాణ క్రైమ్ రేటులో దేశంలో అగ్రస్థానంలో నిలిచింది అని ఈ సందర్భంగా టీపీసీసీ సునీతా రావు గుర్తు చేశారు.
సన్ బర్న్ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం
హైదరాబాద్ లో సామూహిక అత్యాచారాలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, హత్యలు, డ్రగ్స్ మాఫియాలు రెచ్చిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 23వ తేదీన శంషాబాద్ లో జరిగే సన్ బర్న్ ఏరినా కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
అలాన్ వాకర్ లైవ్ కన్సర్ట్
ప్రపంచంలోని అత్యుత్తమ కళాకారులలో ఒకరైన అలాన్ వాకర్ ఇండియా టూర్ 2022 లో భాగంగా.. హైదరాబాద్ శివారు శంషాబాద్ లో సన్ బర్న్ ఏరీనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 'ఫేడెడ్', 'ఆన్ మై వే' లాంటి ఎన్నో అవార్డు విన్నింగ్ పాపులర్ పాటలు అలాన్ వాకర్ నుండే వచ్చాయి. సన్ బర్న్ ఈవెంట్ లో ఈ పాపులర్ పాటలను అలాన్ వాకర్ లైవ్ లో వినిపించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ లోని జీఎంఆర్ ఎరీనాలో అలాన్ వాకర్ లైవ్ లో ప్రదర్శన ఇవ్వనున్నారు. హైదరాబాద్ లో ప్రదర్శన తర్వాత అలాన్ వాకర్ సెప్టెంబర్ 24వ తేదీన చెన్నైలో మరో ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే సెప్టెంబర్ 25 వ తేదీన అహ్మదాబాద్ లో లైవ్ లో ప్రదర్శన ఇవ్వనన్నారు.
ఎవరీ అలాన్ వాకర్?
అలాన్ వాకర్ ఒక బ్రిటీష్- నార్వేజియన్ సంగీత నిర్మాత. అలాన్ వాకర్ 1997 ఆగస్టు 14న జన్మించాడు. అలాన్ వాకర్ ఫేడెడ్ పాట తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యాడు. ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా మంచి రేటింగ్ లతో విపరీతమైన వ్యూస్ సాధించాడు. 14 దేశాల్లో ప్లాటినం సింగిల్ గా నిలిచింది. మ్యాగజైన్ డీజే మాగ్ వాకర్ వారి 2019 100 డీజేల జాబితాలో 27వ స్థానంలో నిలిచింది.
2012లో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి ల్యాప్ టాప్ తో సంగీతాన్ని రూపొందించి అప్ లోడ్ చేయడం ప్రారంభించాడు. అలా 2014 లో 400 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూశ్ పొందిన ఫేడ్ పాటను విడుదల చేశాడు. ఆ తర్వాత 2015 లో ఇసెలిన్ సోల్ హీమ్ తో కలిసి ఫేడెడ్ పాటను విడుదల చేశాడు. ఫేడెడ్ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 3 బిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ అందుకుంది.