Reasons For Operation Polo: హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్ పోలో చేపట్టడానికి 5 ప్రధాన కారణాలు ఇవే
Telangana Praja Palana Dinotsavam | వల్లభాయ్ పటేల్ సంస్థానాల రాజ్యాలను ఒప్పించి భారతదేశంలో విలీనం చేయించారు. కానీ, ఇందుకు వ్యతిరేకించిన హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్ పోలో నిర్వహించారు

బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే సమయంలో, దేశాన్ని భారత్, పాకిస్థాన్‌లుగా రెండు ముక్కలుగా విడగొట్టింది. అంతేకాకుండా, దేశంలో ఆనాడు దాదాపు 500కు పైగా సంస్థానాలు ఉండేవి. ఇవి బ్రిటీష్ పాలన కింద ఉన్న స్వతంత్ర రాజ్యాలు. ఇవి భారత్‌లో గానీ, పాకిస్థాన్‌లో గానీ కలవవచ్చని, లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండవచ్చని స్వేచ్ఛను కల్పించింది. దీంతో హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర దేశంగా ఉండాలని నాటి పాలకులు నిజాంలు భావించారు. అయితే, భారతదేశానికి నడిబొడ్డున ఉన్న ఈ రాజ్యం స్వతంత్రంగా ఉండటం భారతదేశ సమగ్రతకు ముప్పుగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది.
భారతదేశ తొలి హోం శాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ ఈ సంస్థానాల విలీనంపై దృష్టి పెట్టారు. ఇందుకు నిరాకరించిన రాజ్యాలను నయానా, భయానా ఒప్పించి భారతదేశంలో విలీనం చేయించారు. కానీ, ఇందుకు వ్యతిరేకించిన హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్ పోలో నిర్వహించారు. దీంతో హైదరాబాద్ సంస్థానం 1948, సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది. అయితే, ఈ ఆపరేషన్ పోలో సైనిక చర్యకు ప్రేరేపించిన ముఖ్య కారణాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
1. హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే నిజాం నిర్ణయం
బ్రిటిష్ ప్రభుత్వం 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది. హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్రంగా కొనసాగాలని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్ణయించుకున్నారు. మన దేశ సంస్థానాలన్నింటికన్నా హైదరాబాద్ సంస్థానం అతి పెద్దది. ఒక రకంగా చెప్పాలంటే, ప్రస్తుత ఫ్రాన్స్ దేశంలో సగం నాటి హైదరాబాద్ సంస్థానం ఉండేది. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక రాష్ట్రాల్లో కొంత భాగం, తెలంగాణ మొత్తం హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. భారతదేశం మధ్యలో మరో రాజ్యం ఉండటం ముప్పుగా భావించిన హోం మంత్రి వల్లభాయ్ పటేల్, భారతదేశంలో ఈ సంస్థానం కలవాల్సిందేనన్న మొండి పట్టుదలతో ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్యకు దిగారు.

2. ప్రజలపై రజాకార్ల హింస
నిజాం ప్రభుత్వానికి మద్దతుగా ఖాసీం రజ్వీ నాయకత్వంలో 'రజాకార్లు' అనే సంస్థ ఏర్పడింది. ఈ ప్రైవేటు సైన్యం ప్రజలపై అరాచకాలకు దిగింది. హింస, దోపిడీ, దాడులకు ఈ రజాకార్లు పాల్పడ్డారు. మరోవైపు, తెలంగాణ సాయుధ పోరాటం నిజాంకు వ్యతిరేకంగా జరుగుతోంది. హైదరాబాద్ సంస్థానంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తాయి. ప్రజలను ఈ రజాకార్ల హింస నుండి రక్షించేందుకు భారత సైన్యం ఆపరేషన్ పోలోకి దిగింది.
3. పాకిస్తాన్‌తో సంబంధాల కోసం నిజాం ప్రయత్నాలు
హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండేందుకు నిజాం పాలకులు పాకిస్థాన్‌తో సంబంధాలు పెట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం పాకిస్థాన్‌కు భారీ మొత్తంలో నిజాం పాలకులు అప్పు కూడా ఇచ్చారు. భారతదేశం ఒకవేళ దాడికి పాల్పడితే, పాకిస్థాన్‌లో చేరే విషయంలో కూడా చర్చలు జరిపారు. ఈ సమాచారం నిఘా వర్గాల ద్వారా భారత ప్రభుత్వానికి చేరింది. ఆలస్యం చేస్తే చరిత్రలో ఇది వ్యూహాత్మక తప్పిదం అవుతుందని, భారత సమగ్రతకు ఇది ముప్పుగా మారుతుందని భారత ప్రభుత్వం భావించింది. ఆపరేషన్ పోలో చేపట్టడానికి ఇది మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
#OnThisDay in the year 1948, under direct intervention from then Deputy Prime Minister of India Sardar Vallabhbhai Patel, #OperationPolo commenced to integrate the state of Hyderabad into the Indian Union. @MIB_Hindi @MinOfCultureGoI @AIRNewsHindi pic.twitter.com/y6jZgpvUUe
— Akashvani आकाशवाणी (@AkashvaniAIR) September 13, 2025
4. భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం సహాయం కోసం నిజాం ప్రయత్నాలు
తన రాజ్యం స్వతంత్రంగా ఉండాలని భావించిన నిజాం, ఈ సమస్యను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి భారతదేశానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి తలుపులు కూడా తట్టారు. నిజాం పాలకులను ఇలాంటి ప్రయత్నాలు చేసేందుకు అనుమతిస్తే మరింత సమస్యలు ఉత్పన్నమవుతాయని, బయటి దేశాల జోక్యాన్ని తమ అంతర్గత వ్యవహారాల్లో అనుమతించకూడదన్న భారత ప్రభుత్వ ఆలోచనతో వెంటనే ఆపరేషన్ పోలోకు సైన్యాన్ని దింపారు.
5. భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం చేయాలన్న ప్రజల డిమాండ్
నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల హింసకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఒకవైపు జరుగుతోంది. రైతులు భూస్వామ్య దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రజా నిరసనలు పెద్ద ఎత్తున తెలంగాణ అంతటా జరుగుతున్నాయి. రజాకార్ల హింసను అడ్డుకునేందుకు గ్రామ గ్రామాన ప్రజా దళాలు ఏర్పడ్డాయి. భారత కమ్యూనిస్టులు, ప్రజా సంఘాల వంటివి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నాయి. ప్రజలు భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోవాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. జాతీయ జెండా ఎగురవేస్తే నిజాం ప్రైవేటు సైన్యం అడ్డుకునే పరిస్థితి. ప్రజల ఒత్తిడి భారత ప్రభుత్వంపై అధికంగా పెరిగింది. దీంతో ఆపరేషన్ పోలోకు భారత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఈ అన్ని కారణాల కారణంగా హైదరాబాద్ సంస్థానం విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. శాంతి చర్చలు జరిపినా నిజాం పాలకులు అంగీకరించరన్న దృఢ నిశ్చయానికి భారత ప్రభుత్వం వచ్చింది. సైనిక చర్యే సరైన నిర్ణయంగా భావించాల్సి వచ్చింది. పాకిస్థాన్‌తో సంబంధాలు, అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు అందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితులే ఆపరేషన్ పోలోకు దారి తీశాయి.






















