Munugode Bypolls : మునుగోడు బరిలో టీఆర్ఎస్సా - బీఆర్ఎస్సా ? నిబంధనలేం చెబుతున్నాయి ?
మునుగోడు బరిలో నిలిచే అభ్యర్థి టీఆర్ఎస్ నా, బీఆర్ఎస్‌నా అన్నదానిపై ఉత్కంఠ ప్రారంభమయింది. టీఆర్ఎస్ అభ్యర్థే బరిలో ఉండే అవకాశాలున్నాయి.
Munugode Bypolls : తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతగా వ్యవహరించనున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మొదటి లక్ష్యం మునుగోడు ఉపఎన్నిక. రెండు రోజుల్లో మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మునుగోడులో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అభ్యర్థి బరిలో నిలుస్తారా.. భారత రాష్ట్ర సమితి తరపునా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవాటానకి టీఆర్ఎస్ ఇంకా అంతర్థానం కాలేదు. తమ పార్టీ పేరును మార్చుకుంటున్నామని .. ఆ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం తీర్మానించడం వరకే అయింది. ఇప్పుడు ఈసీ ఆ తీర్మానాన్ని ఆమోదించి.. పేరు మార్పుపై ప్రకటనపై నిర్ణయం వెలువరిస్తే అప్పుడు అధికారికంగా టీఆర్ఎస్ పేరు భారత రాష్ట్ర సమితిగా మారుతుంది.
పేరు మార్పు అధికారికంగా జరిగే సరికి నెల రోజులు పట్టే అవకాశం
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను తీసుకుని ఈ నెల 6న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఢిల్లీకి వెళ్లి సీఈసీకి వాటిని అందజేస్తారు. ఈసీ దానిని పరిశీలించిన తర్వాత అభ్యంతరాలు ఉంటే తెలుపాల్సిందిగా నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు లేదా.. ఆ పార్టీ ఇచ్చిన లేఖను స్వీకరించి ఆమోదించవచ్చు. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటాయని భావిస్తే పత్రికా ప్రకటన ఇచ్చి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. 30 రోజుల వ్యవధిలో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే తుది నిర్ణయం వెలువరిస్తుంది. అధికారికంగా కొత్త పేరు మనుగడలోకి వస్తుంది. టీఆర్‌ఎస్ దరఖాస్తుకు ఎన్నికల సంఘం నుంచి ఆమోదం లభిస్తే టీఆర్‌ఎస్ కొత్త పేరు, గుర్తుతో ఎన్నికల్లో నిలుస్తుంది. పార్టీ పేరు మారేదాకా వినోద్ నేతృత్వంలోని టీం ఫాలో అప్ చేస్తుంది.
బీఆర్‌ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేసిన తర్వాత టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ బీఫారం జారీ చేయగలరా ?
అంటే ఈసీ ఆమోద ముద్ర వేసే వరకూ బీఆర్ఎస్ కేవలం చెప్పుకోవడానికే.. టీఆర్ఎస్సే ఉనికిలో ఉంటుంది. ఒక వేళ ఈసీ పేరు మార్పును గుర్తించాలనుకుంటే రాత్రికి రాత్రి గుర్తించవచ్చు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండి... టీఆర్ఎస్ గుర్తింపు రద్దయిపోయి..త ఆ ప్లేస్‌లో బీఆర్ఎస్ అమల్లోకి వస్తే కొన్ని క్లిష్ట సమస్యలు వస్తాయి. అియతే కేసీఆర్ వీటన్నింటినీ ఆలోచించే ఉంటారని చెబుతున్నారు. అందుకే మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ పేరుతోనే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షునిగానే కేసీఆర్ బీఫాం జారీ చేస్తారు. ఇది చెల్లుతుందా అనే అనుమానం టీఆర్ఎస్ నేతల్లోనే ప్రారంభమయింది. ఎందుకంటే బీఆర్ఎస్‌గా మారుస్తూ ఐదో తేదీన కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీఫారం ఆ తర్వాత టీఆర్ఎస్ అధ్యక్షునిగా జారీ చేస్తే సమస్యలు వస్తాయి.
ఎన్నికల ప్రక్రియ మధ్యలో టీఆర్ఎస్ పేరు మారిపోతే !
అందుకే మునుగోడు ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంది. లేకపోతే అటు బీఆర్ఎస్ ప్రకటనకు.. ఇటు టీఆర్ఎస్ గుర్తింపుతో పాటు .. మునుగోడు ఎన్నికల్లో అభ్యర్థికి కూడా చిక్కులు వస్తాయి. మునుగోడు ఫలితం తేడా.. కేసీఆర్‌కు రాజకీయ పరమైన అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.