Weather Updates: ఏపీలో ఆ జిల్లాల్లో 4 రోజులు వర్షాలు, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Weather Updates: నేటి నుంచి నాలుగు రోజులపాటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. రెండు రోజులపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Southwest Monsoon in AP and Telangana: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అల్పపీడన ద్రోణి సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల మధ్య ఉన్నదని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. రెండు రోజులపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ ఇటీవల హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్రయ యానాంలలో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పీడనం బలపడి, కాకినాడ జిల్లాలోని తుని వైపు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో, అనకాపల్లి, నర్సీపట్నంలోనూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు, ఎల్లుండి సైతం తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.
Impact based forecast for the districts of Andhra Pradesh and Vijayawada city for next 2 days Dated 26.06.2022. pic.twitter.com/fkmC5PvXQo
— MC Amaravati (@AmaravatiMc) June 26, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి వర్ష సూచన సాధారణంగా ఉంది. ఉత్తర కోస్తాంధ్ర తరహాలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవు. నేటి నుంచి నాలుగు రోజులపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బాపట్ల, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపున విజయవాడ, దివిసీమ, బందరు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలే అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.
హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 26, 2022
తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో జూన్ 28 వరకు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇటీవల ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడతాయని పేర్కొంది. నేటి ఉదయం సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.