Weather Updates: తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్! భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఈ 3 జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్
ఈ నెల 7, 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD వివరించింది. మిగతా రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
Weather Latest News: ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు భారీగా పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. 7, 8, 11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు ఉండనున్నట్లు అధికారులు అంచనా వేశారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి
ఈస్ట్ వెస్ట్ షీర్ జోన్ 20 డిగ్రీస్ నార్త్ లో సముద్రం మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య ఉత్తర ద్వీపకల్ప భారత్ మొత్తం కేంద్రీకృతమైంది. నిన్న వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఇవాళ ఉత్తర ఒడిశాను ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు తోడవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
ఉత్తర కోస్తా, యానాంలో ఇలా..
ముఖ్యంగా ఈ నెల 7, 8, 11 తేదీల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మిగతా రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. నేడు, రేపు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
Telangana Weather: తెలంగాణలో ఇలా..
తెలంగాణలో అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు. ముఖ్యంగా నేడు తెలంగాణలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్క భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాల్లో నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రేపు ఇక్కడ రెడ్ అలర్ట్
కానీ, 9న మాత్రం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఈ జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్ జారీ చేశారు.