Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్! ఎల్లో అలర్ట్ జారీ - IMD అధికారుల అంచనా
ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Weather Latest News: ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిస్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. తూర్పు రాజస్థాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ గఢ్, ఏపీలోని కోస్తా ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల, 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో జూలై 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో సైతం పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ఉండగా, రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావం రాయలసీమపై లేదు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో చలి గాలులు వీస్తాయి.
Telangana Weather: తెలంగాణలో ఇలా
‘‘మొదటి వారం 29.7.2022 నుండి 4.8.2022 వరకు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా, తెలంగాణపై రెండవ వారం 5.8.2022 నుండి 11.8.2022 వరకు వర్షపాతం పెరిగే అవకాశం ఉంది.’’ అని ఐఎండీ హైదరాబాద్ అధికారులు ట్వీట్ చేశారు.
ఇక హైదరాబాద్ లో వాతావరణం పగలు, ఒకలా, మధ్యాహ్నం, రాత్రి మరోలా ఉంటోంది. ఉదయం పొడి వాతావరణం కొనసాగుతుండగా, సాయంత్రం, రాత్రి వేళల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నాడు సాయంత్రం వేళ దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాజేంద్రనగర్, షేక్‌పేట్, టోలీచౌకి, రాయదుర్గం, షాపూర్ నగర్, చింతల్, గాంజులరామారం ప్రాంతాల్లో విపరీతమైన కురిసింది.
నేడు ఇలా..
ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.