Weather Latest Update: 22 నాటికి మరో వాయుగుండం, వెంటనే తుపానుగా - తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు వానలే!
తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. నేడు (అక్టోబరు 20), రేపు ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి
తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అక్టోబరు 22న ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా బలపడుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడుతుందని చెప్పారు. చివరికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలో వర్షాల పరిస్థితి ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు.. అక్టోబరు 20న తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగగా హెచ్చరికల్లాంటివి ఏమీ జారీ చేయలేదు. అక్టోబరు 23 వరకూ ఇలాగే వాతావరణ పరిస్థితి ఉండొచ్చని తాజా వెదర్ బులెటిన్ లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
అక్టోబరు 20 తెల్లవారుఝామున 3.30 గంటలకు విడుదల చేసిన నౌకాస్ట్ వార్నింగ్ ప్రకారం.. నేడు ఉదయాన్నే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 19, 2022
ఏపీలో వాతావరణం ఇలా
అక్టోబరు 20న ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలు, యానంలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. దీనివల్ల వరి, అరటి పంటలకు కాస్త నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపుల సమయంలో జనం ఇళ్లలో ఉండాలని, చెట్ల కింద ఉండడం సరికాదని అధికారులు హెచ్చరించారు. ఎలక్ట్రిక్ పోల్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. విజయవాడలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని తెలిపారు.
Impact based weather forecast for the districts of Andhra Pradesh and Vijayawada city for next 2 days Dated 19.10.2022. pic.twitter.com/KqFTq5gngx
— MC Amaravati (@AmaravatiMc) October 19, 2022
ఈశాన్య రుతుపవనాలు కూడా ఓ కారణం - ఏపీ వెదర్ మ్యాన్
‘‘ఈశాన్య రుతుపవనాల వల్ల 20న తెల్లవారిజామున నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. ఈ వర్షాలు అన్ని చోట్లల్లో పడదు, కానీ కోస్తా భాగాల్లో మోస్తరు నుంచి భారీగా ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం వలన ఏర్పడిన గాలుల సంగమం వలనే ఈ వర్షాలు.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.