Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన వేడి, ఉత్తరాదిలో భారీ వర్షాలు - ఈ రాష్ట్రాల్లో 65 మంది మృతి
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ / వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రము వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (ఆగస్టు 15) ఓ ప్రకటనలో తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 81 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే గాలులు కూడా స్వల్పంగా వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతతో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. దీనికి ఉక్కపోత కూడా తోడవుతుంది. వాతావరణంలోని మార్పుల వలన ఈ పరిస్థితి నెలకొంది. మాములుగా అయితే మే నెల నుంచి ఆగష్టు వరకు ఆంధ్రప్రదేశ్ వాతావరణం పై సోలార్ రేడియేషన్ ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. అయితే, భూమి ఉపరితలం పైకి వచ్చే సూర్యకిరణాల ప్రసరణ వర్షాకాలంలో ఉండే మేఘాల కారణంగా వేసవితో పోలిస్తే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీ పైభాగంలో మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దీంతో పాటు ఆయా ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' కూడా జారీ చేశారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాల కారణంగా 65 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
రెండు రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడటం, వరదలు, మేఘాలు, భారీ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులకు కూడా చాలా నష్టం వాటిల్లింది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఇక్కడి మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి.