Kazipet Coach Factory: 44 ఏళ్లుగా కాజీపేట్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాట్లేదు? దాన్ని ఎవరు తన్నుకుపోయారు?
Warangal News: రెండుసార్లు కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ.. ఇతర ప్రాంతాలకు తరలిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికల హామీగా ఉంటూ వచ్చింది.
Warangal News: త్రినగరిగా ఉన్న వరంగల్ లో ఒక నగరమైన కాజీపేటలో అప్పటి నిజాం ప్రభుత్వం రైల్వే స్టేషన్ ను నిర్మించడం జరిగింది. కాజీపేట రైల్వే స్టేషన్ ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధి. కాశీ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్లాలనుకున్నా కాజీపేట రైల్వేస్టేషన్ మీదుగా వెళ్ళాలి. ఈ రైల్వే స్టేషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ లో అత్యధికంగా ఆదాయం వచ్చే జంక్షన్ గా గుర్తింపు ఉంది. అప్పటి నుండి ఇప్పటివరకు కాజీపేట రైల్వే స్టేషన్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అంతేకాకుండా కాజీపేట రైల్వే స్టేషన్ పరిధిలో కొత్తగా ఎలాంటి రైల్వే ప్రాజెక్టులు రాలేదు. కాజీపేట రైల్వే స్టేషన్ ను డివిజన్ గా, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పోరాటం చేసున్నారు ఈ ప్రాంతవాసులు.
44 ఏళ్లుగా పోరాటం
వరంగల్ ప్రాంతం వెనకబడిన ప్రాంతంతోపాటు ఇక్కడి యువత కు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అప్పటి కమ్యూనిస్టు పార్టీ నేతలు మడత కాళిదాసు, భగవాన్ దాస్ కు 1978 లో కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమ మొదలు పెట్టారు. 1980 నుండి కోచ్ ఫ్యాక్టరీ కోసం ఆయా పార్టీల నేతలు జెండాలను పక్కన అఖిల పక్షంగా మేధావులు, యువత, ప్రజలు ఉద్యమంలో పాల్గొనడంతో ఊపందుకుంది. కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయంలో వరంగల్ ప్రాంతానికి చెందిన పీవీ నర్సింహారావు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండడంతో కోచ్ ఫ్యాక్టరీ అఖిల పక్ష నేతలను ఇందిరా గాంధీ వద్దకు తీసుకువెళ్ళడంతో 1982లో పార్లమెంట్ సాక్షిగా కాజీపేట కు కోచ్ ఫ్యాక్టరీ నీ మంజురుచేయడం జరిగింది.
రాయబరేలీకి కోచ్ ఫ్యాక్టరీ
వరంగల్ వాసుల దురదృష్టవశాత్తూ 1984 లో ఖలిస్తాన్ ఉద్యమ నేత చేతిలో ఇందిరాగాంధీ చనిపోవడం, ఆ ప్రాంతంలో ఉద్యమాన్ని చల్లార్చడం కోసం లోంగ్ కావాలా ఒప్పందం ప్రకారం కబుర్థాలకు కాజీపేట లో మంజూరైన అయిన కోచ్ ఫ్యాక్టరీని అక్కడికి తరలించడం జరిగింది. దీంతో వరంగల్ ప్రాంతంలో మరోసారి కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం ఎత్తిన కొనసాగుతూ వచ్చింది వరంగల్ కాజీపేట ప్రాంత వాసుల న్యాయమైన డిమాండ్ కావడంతో 2004 యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రెండవసారి కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయడం జరిగింది. మళ్లీ దురదృష్టం కాజీపేట వాసులను వెంటాడింది. రెండోసారి మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ సైతం అప్పటి యూపీఐ చైర్మన్ సోనియాగాంధీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబలేరీకి తరలించడం జరిగింది.
దీంతో కోచ్ ఫ్యాక్టరీ కల వచ్చినట్టే వచ్చి చేజారుతుండడంతో తీవ్ర నిరాశకు గురైన ఉద్యమకారులు, ఈ ప్రాంత వాసులు ఉద్యమాన్ని ఆపలేదు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నడంతో తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది ఈసారైనా కల సహకారం అవుతుందనుకుంటే బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టేసింది. అనేక బడ్జెట్లలో కోచ్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయిస్తుందని అనుకుంటే చివరకు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది.
ప్రత్యక్షంగా 60 వేల మందికి ఉపాధి
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా 60 వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పరోక్షంగా మరో 50 వేల మందికి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు దొరకడంతోపాటు ఈ ప్రాంతంలో వివిధ వ్యాపారాలతో కాజీపేటతో పాటు చుట్టూ ప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి 1978 నుండి నేటి వరకు కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం కొనసాగుతుంది. నిప్పులపై నీళ్లు చల్లినట్లు వ్యాగన్ ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేసింది. ఈ ఫ్యాక్టరీ లో రైలు బోగీలు మాత్రమే తయారవుతాయి. అదే కోచ్ ఫ్యాక్టరీ అయితే రైలుకు కావలసిన ప్రతి పార్ట్ ఇందులోనే తయారవుతుంది కాబట్టి ఉపాధి అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి.
ఎన్నికల సమయంలో హామీగా
1980 నుంచి ఏ ఎన్నికలు వచ్చినా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం ఆయా పార్టీలకు హామీగా మారుతుంది. 44 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల హామీగా కోచ్ ఫ్యాక్టరీని ఇస్తున్నారే తప్ప ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేయడం లేదని చెప్పవచ్చు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలైనా ఈ ప్రాంతం నుండి ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులైనా ఫ్యాక్టరీ ఏర్పాటు అంశానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదనేది ఈ ప్రాంత వాసుల ఆరోపణ. అయితే కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో వైస్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పినా ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కోచ్ ఫ్యాక్టరీ హామీగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి లేదనే ఆరోపణలు
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఒత్తిడి తేవడం లేదని ఉద్యమకారులు ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు 18 వందల ఎకరాల స్థలం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పాటు 18 వందల ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వానికి చూపెట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని పక్కన పెడుతుందని ఈ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. అయితే కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు పోరాటం ఆపమని కోచ్ ఫ్యాక్టరీ పోరాట సమితి నాయకులు కరాకండిగా చెప్తున్నారు.