TSRTC Passengers: బస్సులన్నీ ఖమ్మం బీఆర్ఎస్ సభకు, బస్టాండ్లలో గంటల తరబడి వేచిచూస్తున్న ప్రయాణికులు
ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి. దాంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరంగల్ : తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి. దాంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి భారత సింహ గర్జనతో ఖమ్మం నుంచి కేసీఆర్ తన సభలను ప్రారంభిస్తున్నారు. అయితే ఇందుకోసం భారీగా జన సమీకరణకు బీఆర్ఎస్ నేతలు, మంత్రులు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా భారీగా జనసమీకరణ కోసం బస్సులను ఖమ్మం సభకు తరలించారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల వారికి రవాణా సౌకర్యంపై ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
వరంగల్ రీజినల్ లోని 9 డిపోలలో పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, వరంగల్ 1,వరంగల్ 2, హన్మకొండ ,మహబూబాబాద్, తొర్రురు, జనగామ డిపోలలో మొత్తం 900వందల బస్సులు ఉంటే అందులో 300ఆర్టీసీ బస్సు లు సభ కోసం వెళ్లినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. వరంగల్ రీజినల్ లోని అన్ని డిపోలలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంకు అతి సమీపంలో ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వున్న ఆర్టీసీ బస్టాండ్ లో వున్న బస్సులు మొత్తం ఖమ్మం సభకు పెట్టడంతో ప్రయాణికుల ఉదయం నుండి బస్టాండ్ లో పడిగాపులు కాస్తున్నారు. చంటి బిడ్డలతో బస్టాండ్లకు వచ్చాం, బస్సులు లేకుండా ఎలా ప్రయాణం చేయాలి అని ప్రశ్నిస్తున్నారు. రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉందని, బస్టాండ్లకు వచ్చాం, చిన్న పిల్లల్ని ఎత్తుకుని గంటల తరబడి నిల్చోవడం.. అయినా బస్సులు లేవని సమాధానం వస్తుందన్నారు. ఈరోజు తిరిగి హైదరాబాద్, ఇతర నగరాలకు వెళ్లాల్సి ఉందని తాము ప్రైవేట్ ఉద్యోగులమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
గంటల తరబడి వున్న బస్సులు రావటం లేదని... బస్సుల ఎందుకు రావటం లేదని ఆర్టీసీ అధికారులను అడుగుతే ఖమ్మం సభకు వెళ్ళిన్నాయని చేప్పుతున్నారు. మేం హైదరాబాద్ పోవాలని పొద్దుగాల వచ్చినాము ఇంతవరకు బస్సులు రాలేదని పిల్లలతో వచ్చి ఇబ్బందుల పడుతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యూలర్ బస్సు సర్వీసులు రద్దు చేసి వాటిని ఖమ్మం బీఆర్ఎస్ సభకు మళ్లించడంతో రద్దు ఆర్టీసి యాజమాన్యంతో పాటు బీఆర్ఎస్ నాయకులపై ప్రయాణికులు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు.
ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ ఏమన్నారంటే..
ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ శ్రీలత మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు, తిరిగి తమ ప్రాంతాలకు తిరిగి వస్తున్నారని తెలిపారు. గత రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ ఇలాగే ఉందన్నారు. ప్రతిరోజూ 1.5 కోట్ల ఆదాయం వస్తుందని, మంగళవారం నాడు తమకు రూ.1.94 కోట్ల ఆదాయం సమకూరిందని, సోమవారం రూ.1.9 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చిందన్నారు. అయితే బీఆర్ఎస్ మీటింగ్ కు బస్సులు పంపించడం వల్ల బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారనడంలో వాస్తవం లేదని, గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఉదయం స్కూల్, సాయంత్రం స్కూల్ నుంచి రిటర్న్ కోసం ఏర్పాటు చేసే బస్సులను బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కోసం పంపించినట్లు తెలిపారు. వరంగల్ రీజియన్ నుంచి 930 బస్సులు ఉంటే అందులో 300 బస్సులను పార్టీ మీటింగ్ కు పంపించినట్లు వెల్లడించారు. రేపటి నుంచి రెగ్యూలర్ స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయని, అప్పుడు మళ్లీ రెగ్యూలర్ బస్సు సర్వీసులు కొనసాగిస్తామని ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ శ్రీలత చెప్పారు.
కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభకు పంజాబ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. ఇదే వేదికగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించారు. నేటి ఉదయం సీఎం కేసీఆర్ తోపాటు మరో ఇద్దరు సీఎంలు యాదాద్రిని దర్శించుకున్నారు. అనంతరం హెలికాప్టర్ లో బయలుదేరి ఖమ్మం సభకు చేరుకున్నారు.