Warangal News: వరంగల్ జిల్లా టూర్‌కు రాష్ట్రపతి, గీత కార్మికులకు నష్టం! ఎలాగంటే?
ఈ నెల 28న రామప్పకు రాష్ట్రపతి వస్తున్నందున హెలిప్యాడ్ దిగడం కోసం తాటి చెట్ల తొలగింపుతో పాలంపేట గీత కార్మికులు నష్టపోతున్నారు.
వరంగల్ జిల్లా రామప్పకు రాష్ట్రపతి ఈనెల 28న వస్తున్నందున హెలికాప్టర్ దిగే స్థలం కోసం తాటిచెట్లు ఆడ్డుగా ఉన్నాయని తొలగించడాన్ని నిరసిస్తూ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలంపేట గౌడసంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రపతి రాకను స్వాగతిస్తున్నామని కానీ ఆ పేరుతో కల్లు గీత కార్మికులు జీవనోపాధి అయిన తాటిచెట్లను తొలగించడం సమంజసం కాదని అన్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి పాలంపేట గీత కార్మికులతో చర్చ జరిపి తాటి చెట్ల పెంపకానికి 560 జీవో ప్రకారం భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని అన్నారు.
అలాగే గౌడ సంఘ సొసైటీకి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఒక పక్క తాటి ఈత చెట్లను అక్రమంగా తొలగిస్తే కేసు నమోదు చేస్తామని అంటూ గీత వృత్తిని ప్రోత్సహిస్తుంటే రాష్ట్రపతి వస్తున్నారని తాటి చెట్లు ఉన్న స్థలాలనే హెలికాఫ్టర్ దిగడం కోసం ఎంచుకోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలంపేట గౌడ సంఘం గీత కార్మికులకు న్యాయం చేయాలని లేనిచో దశల వారీగా కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు నిరవధిక దీక్షలు చేస్తామని వారు అన్నారు.
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుండె బోయిన రవి గౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు - ఆర్డీవో రమాదేవి, వెంకటాపురం ఎస్ఐ, ఎక్సైజ్ సీఐ తదితరులు ఎమ్మార్వోను కలిసి వినతి పత్రాలు అందజేశారు.
భారత రాష్ట్రపతి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి: ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య
ములుగు జిల్లా వెంకటాపుర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయానికి ఈ నెల 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ జిల్లా పర్యటనలో భాగంగా యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయం సందర్శించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. వెంకటాపుర్ మండలం పాలంపేట (రామప్ప)లోని హెలిప్యాడ్, దేవాలయ సుందరీకరణ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఎటువంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రమాదేవి, డీఆర్డీవో నాగ పద్మజ, డీపీఓ వెంకయ్య, పంచాయత్ రాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ నాగేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ మంజుల సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.