Konda Surekha Couple: కొండా దంపతులు బీజేపీలో చేరతారా ! మళ్లీ ఊపందుకున్న ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది
Konda Murali Couple Politics: 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఎక్కువైంది. అయినా తాము పార్టీ మారేది లేదని కొండా సురేఖ దంపతులు చెప్పారు.
పార్టీ మార్పుపై కొండా సురేఖ దంపతులు ఎందుకు క్లారిటీ ఇచ్చుకోవాల్పి వస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉనికిని కోల్పోతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఎక్కువైంది. ఆ ఎఫెక్ట్‌తో ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు పార్టీని వీడటం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారన్న ప్రచారం నేపథ్యంలో కొండా దంపతులు కూడా పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే కొండా దంపతులు తాము కాంగ్రెస్‌ను వీడటం లేదని చెప్పుకోవాల్సి వస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీపై వాళ్లకు చాలా అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీలో చేరుతారని ప్రచారం...
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొండా దంపతులు పార్టీ మారుతున్నారన్న ప్రచారం గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతోంది. కొండా కుటుంబం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారని వెలువడుతున్న ఊహాగానాలపై వీరి కుమార్తె సుస్మిత పటేల్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వారు క్లారిటీ ఇచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, దానిని ఎవరూ నమ్మవద్దని ఊహాగానాలకు చెక్ పెట్టారు.
అంచెలంచెలుగా ఎదిగిన కొండా సురేఖ..
కొండా సురేఖ తెలంగాణలో చురుకైన రాజకీయ నాయకురాలు.... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె టీఆర్‌ఎస్ తరపున వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. వరంగల్ కి చెందిన ఆమె మండల పరిషత్ సభ్యురాలిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరగక ముందు శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమం, ఆరోగ్యం, ప్రాథమిక విద్యా మంత్రిగా పని చేశారు. ఆపై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో ఆమె తన భర్తతో సహా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన కొండాసురేఖ... ఆయన అకాల మరణంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పక్షాన నిలిచారు. అయితే విభజన కాలం నాటి పరిస్థితులతో 2013 జూలైలో కొండా సురేఖ వైసీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. 2018లో ఆమె తన భర్తతో కలిసి టీఆర్ఎస్ పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆమె పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు...
ఆ క్రమంలో కొండా దంపతులు మళ్లీ పార్టీ మారుతున్నారన్న ప్రచారం మొదలైంది. కొండా దంపతులు క్లారిటీ ఇచ్చారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న వార్తలను నమ్మొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు..తాము నమ్ముకున్న కాంగ్రెస్ జెండా కిందనే, కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతామని కొండా దంపతులు తేల్చి చెబుతున్నారు. ప్రజల వద్ద నుండి పెద్ద ఎత్తున తమకు ఆదరణ వస్తుందని, అది చూసి ఓర్చుకోలేని అధికార పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొండా దంపతులు మండిపడుతున్నారు. అధికార పార్టీ నాయకులు చేసే నీచ రాజకీయాలను ఎవరు నమ్మొద్దు అంటూ కొండా మురళి వెల్లడించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడటం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఇక బీజేపీ వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ క్రమంలో కొండా దంపతులు కూడా పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. అందుకే కొండా దంపతులు తాము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కొండా సురేఖ చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి వచ్చే ఎన్నికలలో తాము వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతామని కొండా దంపతులు స్పష్టం చేస్తున్నారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ బరిలో ఉంటుందని, మరో సీటు ఇస్తే తాను గానీ, తన కుమార్తె సుస్మిత పటేల్ కానీ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి చెబుతున్నారు.
ఏ స్థానం నుంచైనా సరే రెఢీ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కష్టంగా ఉన్న ఏ స్థానం నుంచి అయినా తాము ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ గా ఉన్నామని కొండ మురళి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని కొండ మురళి స్పష్టం చేశారు. ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గం మాత్రమే కాకుండా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని కొండ మురళి స్పష్టం చేశారు. ఏదేమైనా రెండో సీటుపై వారి ఆశలు ఎంతవరకు నెరవేరతాయో, అప్పటి వైఖరి ఎలా ఉంటుందోనని వారి అభిమానులు చర్చించుకుంటున్నారు.