Errabelli Dayakar Rao: మహిళలకు రూ.3 లక్షల రుణం, పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి -మంత్రి ఎర్రబెల్లి
Errabelli Dayakar Rao: మహిళలకు మూడు లక్షల రూపాయల రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజక వర్గాన్ని ఎంపిక చేశామన్నారు.
Errabelli Dayakar Rao: మహిళలకు మూడు లక్షల రూపాయల రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నామని, ఇందుకోసం తొలుత పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజక వర్గాన్ని ఎంపిక చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయ్యాక తెలంగాణ రాష్ట్రం అంతటా అమలు చేస్తామని చెప్పారు. జనగామలో దాదాపు 3 వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ఇవాళ హాజరు అయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలో మహిళలకు మంత్రి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి.. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాల్లోని మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి, శిక్షణ కూడా ఇస్తామని మంత్రి వివరించారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
మహిళా సాధికారత లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సెర్ప్ మరియు స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలోని 3000 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని నేడు పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/ap6uVFzVd2
— Errabelli DayakarRao (@DayakarRao2019) December 26, 2022
మహిళల సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేనన్ని కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని మంత్రి వివరించారు. శిక్షణ తీసుకున్న మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చేయడమై తన బాధ్యత అని చెప్పారు. మహిళా సాధికారత లక్ష్యంగా 3000 మందికి మహిళల కుట్టు మిషన్ శిక్షణా తరగతులనువ ప్రారంభించారు. అనంతరం శిక్షణ పొందే మహిళలు, స్థానిక నేతలు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండగా 7 సార్లు ఎన్నికల్లో గెలిచానని చెప్పారు. చాలా మంది సీఎంలను, పార్టీలను చూశాను కానీ సీఎం కేసీఆర్ లా ఎవరూ అభివృద్ధి చేయలేరని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయినప్పుడు తన నియోజక వర్గంలో, రాష్ట్రంలోని అక్కా, చెల్లెళ్లు కుండలు పట్టుకుని నీళ్ల కోసం నిలబడే వారని... నీళ్లకు బోరింగ్ వేస్తే చాలు అనేవాళ్లని గుర్తు చేశారు.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చే నిధులన్నీ బోరింగ్ల నిర్మాణాలకో పోయేవని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తున్నారన్నారు. ఈ మిషన్ భగీరథ శాఖ కూడా సీఎం తనకే ఇచ్చారని వివరించారు. అప్పట్లో మహిళలు బయటకు రావడానికి భయపడే వాళ్లని, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు డ్వాక్రా మహిళలకు ఒక రూపాయి ఇస్తే బ్యాంక్ లో వేయడానికి వెళ్తే కూడా అభాండాలు వేసేవాళ్లని అన్నారు. కానీ ఇప్పుడు బ్యాంకుకు నేరుగా వెళ్లి దర్జాగా వేస్తున్నారని చెప్పారు. మహిళలకు డబ్బులు రావడం వల్ల వారిపై అరాచకాలు తగ్గాయని వివరించారు. తెలంగాణ రాక ముందు మహిళలకు 4 వేల కోట్ల రూపాయల రుణాలు వచ్చేవని, ఇపుడు 18 వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నామన్నారు. మహిళలకు చైతన్యం వచ్చిందని, మహిళా సంఘాలు ఇంకా బాగా అభివృద్ధి కావాలన్నారు.
అలాగే టెక్స్ టైల్ పార్కులో ఉద్యోగాలు ఇవ్వడానికి 35 సంవత్సరాల లోపు ఉన్న వారు కావాలని టెక్స్ టైల్ పార్క్ వాళ్ళు అడిగారని... అందుకే ఈసారి శిక్షణ కోసం 35 ఏళ్లలోపు మహిళలు అని నిబంధన పెట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. జాబ్ వద్దు అనుకున్న వాళ్ళు 40, 50 ఏళ్లు ఉన్నా వచ్చే బ్యాచ్ లో శిక్షణ ఇస్తామన్నారు. వచ్చే బ్యాచ్ కు వయో పరిమితి, విద్య అర్హత నిబంధన తీసేయమని చెబుతున్నానన్నారు. ఈ కుట్టు మిషన్ల శిక్షణ కోసం సెర్ప్ నుంచి 10వేల రూపాయలు, స్త్రీ నిధి నుంచి 7 వేల రూపాయలు చొప్పున ఒక్కొకరిపై 17వేల రూపాయల ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తం 5 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీనిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఏ బట్టలు ఆర్డర్ ఇచ్చినా అది మనకే వచ్చేటట్లు చేస్తానని చెప్పారు. దీని తరవాత దశలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియ, జనగామ జిల్లా కలెక్టరు శివ లింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, పీడీ డీఆర్డీఏ రామ్ రెడ్డి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, మాజీ చైర్మన్ గాంధీ నాయక్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీలు సావిత్రి, జ్యోతి, సర్పంచ్ యకాంత రావు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.