Hanmakonda News: కాంగ్రెస్ ను దెబ్బకొట్టి బీజేపీకి లాభం చేకూర్చడమే బీఆర్ఎస్ లక్ష్యం- మాణిక్ రావు థాక్రే
Manikrao Thakre - Pawan: యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ ను కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమాలు ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆరోపించారు.
Manikrao Thakre - Pawan: ఫిబ్రవరి 20వ తేదీన రేవంత్ రెడ్డి యాత్ర ముగిసిన తర్వాత కొందరు వ్యక్తుల దాడిలో గాయపడ్డ యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ ను కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పరామర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిని ఆయన ఖండించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అక్రమాలు బాగా పెరిగాయని, వారి అన్యాయాలను ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ కు చాలా చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయని వైద్యులు చెప్పినట్లు మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. వారి దాడిలో పవన్ చనిపోయాడని భావించే వదిలేసి వెళ్ళారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ కుటుంబానికి అండగా ఉంటుందని, ఎలాంటి భయం అవసరం లేదని భరోసా కల్పించారు. 30 మంది దాడి చేస్తే కేవలం నలుగురిపై కేసు నమోదు చేసి చేతులు దులుపేసుకున్నారని ఆరోపించారు. మిగతా వారిని గుర్తించలేదని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని.. కాంగ్రెస్ ను దెబ్బకొట్టి బీజేపీ కి లాభం చేకూర్చడమే బీఆర్ఎస్ లక్ష్యమని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే విమర్శలు చేశారు.
Shri. @Manikrao_INC Ji met Shri Pavan @ImPavanThota Youth Congress leader - Warangal, and expressed solidarity and support. Appreciate his courage and commitment towards INC and its causes. Wishing him speedy recovery and a bright future. #HaathSeHaathJodo @BRSparty #Atrocities pic.twitter.com/pBvGWSTWR7
— Office Of Manikrao Thakare (@OfficeOfThakare) March 2, 2023
తోట పవన్ పై దుండగుల దాడి
ఫిబ్రవరి 20వ తేదీ సోమవారం రోజున హనుమకొండ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ పై కొందరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనకు సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను మంగళవారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధించి హనుమకొండ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ వివరాలను వెల్లడిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత రాత్రి హనుమకొండ లో చేపట్టిన యాత్ర ముగిసిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన పై ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న హనుమకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడి పాల్పడిన నిందితులను గుర్తించామని పోలీసులు ప్రకటించారు.
దాడి చేసిన వారిలో నలుగురు అరెస్టు
వీరిలో నలుగురు నిందితులు 1.చెక్క సుమన్, 2.రావుల కొలను నరేందర్, 3. గుడికందుల వినోద్ కుమార్, సిటిమోర్ సునార్ కృష్ణ లను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. తోట పవన్ పై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్ కమిషనరేట్ ను ముట్టడించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే దాడి చేసింది ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులేనని.. వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకే దాడి చేసినందున ఆయనపైనా కేసులు పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
దాడి ఘటన జరిగిన తెల్లారి పోలీస్ కమిషనర్‌ను కలిసిన రేవంత్ రెడ్డి దీనికి కారణం బీఆర్ఎస్ శ్రేణులే అని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దీని వెనుక ఉన్నారని.. పవన్ హత్యకు కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. ఎర్రబెల్లి, శంకర్ నాయక్ ఇతర ఎమ్మెల్యేలు వార్నింగులతో రెచ్చగొట్టడం వల్లే విపక్ష పార్టీల యాత్రలు, సభలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. ఇక దాడి జరిగిన సమయంలో సీసీ ఫుటేజ్ లో ఉన్నవారి మొబైల్స్ సీజ్ చేసి విచారించాలని రేవంత్ కోరారు.